Petrol Price: పెట్రో బాదుడు.. ఏపీలో సెంచరీ దాటేసిన ప్రీమియం పెట్రోల్!

ఒకవైపు కరోనా విరుచుపడుతుండడంతో జనాలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకీడుస్తున్నారు. కరోనా కట్టడి చర్యలతో ఒకవైపు ఉపాధి కరువై సామాన్యుల పరిస్థితి మరింత దిగజారగా పైన పెట్రో బాదుడు సామాన్యుడి నడ్డివిరుస్తుంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలు వాహన దారులకు చుక్కలు చూపిస్తున్నాయి

Petrol Price: పెట్రో బాదుడు.. ఏపీలో సెంచరీ దాటేసిన ప్రీమియం పెట్రోల్!

Premium Petrol That Has Crossed The Century Mark In Ap

Petrol Price: ఒకవైపు కరోనా విరుచుపడుతుండడంతో జనాలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకీడుస్తున్నారు. కరోనా కట్టడి చర్యలతో ఒకవైపు ఉపాధి కరువై సామాన్యుల పరిస్థితి మరింత దిగజారగా పైన పెట్రో బాదుడు సామాన్యుడి నడ్డివిరుస్తుంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలు వాహన దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రతిరోజూ అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంధన ధరల పెరుగుదల పరోక్షంగా నిత్యావసర ధరల మొదలు వివిధ వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వాలపై విమర్శలూ అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి.

మే 4 నుంచి దేశవ్యాప్తంగా మొదలైన ఈ బాదుడు నేటికీ కొనసాగింది. తాజాగా పెట్రోలుపై 25 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెరిగింది. దీంతో పలు రాష్ట్రాలలో పెట్రోల్ ధర సెంచరీకి చేరువలో ఉంది. తాజా పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్‌కి రూ.0.26 పెరిగి రూ.95.67కి చేరింది. డీజిల్ ధర లీటర్ రూ.0.27 పెరిగి రూ.90.06 అయ్యింది. ఇక అదే ఏపీలోని విజయవాడలో పెట్రోల్ ధర లీటర్ రూ.0.36 పెరిగి 98.08కి చేరగా డీజిల్ ధర లీటర్ రూ.0.36 పెరిగి రూ.91.92కి చేరింది. అదే ప్రీమియం పెట్రోల్‌ సెంచరీ దాటేసింది. ప్రస్తుతం విజయవాడలో లీటర్ ప్రీమియం పెట్రోల్ ధర రూ.101.68గా ఉంది.

నిజానికి ఆర్థిక సూత్రాల ప్రకారం ఏ వస్తువైనా డిమాండ్ తగ్గినప్పుడు ధర తగ్గాలి. కానీ పెట్రోల్, డీజిల్ విషయంలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్లు, కర్ఫ్యూల దెబ్బకు పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గింది. అలాంటప్పుడు ధరలు తగ్గాలి. కానీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వరుసగా ధరలు పెంచుతూనే ఉన్నాయి. మే 2న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం మే 4 నుంచి మొదలైన ఈ బాదుడు ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇప్పటికే ఫిబ్రవరిలో ఒకసారి సెంచరీ దాటేసి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. మరి ఇప్పుడు ఆ రికార్డులను తిరగరాసి వెళ్తుందా.. వెనక్కు తగ్గుతుందా చూడాలి!