బ్రిస్బేన్‌లో భారత్ క్రికెటర్లకు కష్టాలు.. బాత్రూమ్‌లు కూడా వాళ్లే కడుగుతున్నారు..

బ్రిస్బేన్‌లో భారత్ క్రికెటర్లకు కష్టాలు.. బాత్రూమ్‌లు కూడా వాళ్లే కడుగుతున్నారు..

నమ్మశక్యంగా లేదు కదా? ఇంతకుముందు ఎప్పుడూ అటువంటి పరిస్థితి లేదు కదా? కానీ అదే నిజమట.. భారత ఆటగాళ్లు వారి గదుల్లోని బాత్రూమ్‌లను వాళ్లే కడుక్కొనే పరిస్థితి ప్రస్తుతం ఆస్ట్రేలియా‌లో టూర్ నిమిత్తం వెళ్లిన ఆటగాళ్లకు దాపురించిందట. ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ ఆడేందుకు వెళ్లిన టీమిండియాకి కరోనా కారణంగా కష్టాలు వచ్చి పడ్డాయట. గాయ‌ప‌డిన సైన్యంతో బ్రిస్బేన్‌లోని గ‌బ్బా స్టేడియంలో రికార్డును బ‌ద్ధ‌లు కొట్ట‌ేందుకు టీమిండియా సిద్ధం అవుతోంది.

గ‌త 32 ఏళ్ల‌లో ఒక్క మ్యాచ్ కూడా ఈ స్టేడియంలో ఓడిపోని ఆస్ట్రేలియా టీమ్‌ను ఢీకొట్టేందుకు సిద్ధం అవుతోంది టీమిండియా.. ఆస్ట్రేలియాకు అదిరిపోయే రికార్డు ఉన్న ఇదే స్టేడియంలో భారత జట్టుకు మాత్రం చెత్త రికార్డు ఉంది. ఈ స్టేడియంలో టీమిండియా ఇప్పటివరకు ఒక్క టెస్ట్ కూడా గెల‌వ‌లేదు. ఈ సమయంలోనే హోటల్ గదుల్లో కష్టాలు పడుతోంది భారత జట్టు.

కరోనా కారణంగా ఈ స్టేడియానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో సోఫిటెల్ అనే ఓ ఫైవ్ స్టార్‌ హోటల్‌లో ప్రస్తుతం భారత జట్టు ఉంటోంది. ఈ హోటల్ మొత్తాన్ని పూర్తిగా టీమిండియాకి కేటాయించగా.. కనీస అవసరాలకు కూడా మనుషులను లోపలకు రానివ్వని క్రికెట్ ఆస్ట్రేలియా.. అతి జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. దీంతో హోటల్‌లో ఏ సౌకర్యాన్ని భారత క్రికెటర్లు వాడుకోలేకపోతున్నారు. చివరికి బాత్రూమ్‌లను కూడా భారత క్రికెటర్లే కడుక్కోవల్సిన పరిస్థితి.

కఠిన లాక్‌డౌన్ అమల్లో ఉండడంతో భారత ఆటగాళ్లు ఫైవ్‌స్టార్ హోటల్లో ఖైదీలుగా మారిపోయారు. భారత క్రికెటర్లు బయో- సెక్యూర్ బబుల్‌లో ఉండగా.. వారితో ఎవరికీ ఫిజికల్ కాంటాక్ట్ ఉండకుండా నిర్వాహకులు హోటల్ మొత్తాన్ని అదుపులోకి తీసుకుని మిగిలినవారిని ఖాళీ చేయించారు.

హౌస్ కీపింగ్, రూమ్ సర్వీస్ చేసే సిబ్బంది కూడా హోటల్లో లేరు.. రెస్టారెంట్, జిమ్‌ రూమ్‌లకు లాక్ చేశారు. ఫుడ్ కూడా ఆ హోటల్‌కు సమీపంలో ఉన్న భారత రెస్టారెంట్ నుంచి తెప్పించి ఓ ఫ్లోర్‌లో ఉంచుతున్నారు. దీంతో గదుల్లో బందీలయ్యాం. మా బెడ్స్ మేమే సర్దుకుంటున్నాం. బాత్రూమ్‌లు కడుక్కుంటున్నాం.. చాలా ఇబ్బందిగా ఉందంటూ టీమ్‌మేనేజ్‌మెంట్ బీసీసీఐకి ఫిర్యాదు చేసింది. హోటల్‌లో కనీస వసతులు కూడా ఆటగాళ్లకి ఇవ్వకపోతే ఎలా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Team India (@indiancricketteam)