ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టీకా రూ. 250కే!

ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టీకా రూ. 250కే!

కరోనా టీకా సామాన్య ప్రజానికానికి అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన కేంద్రం.. ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టీకా ఒక్కో డోసు ధరను రూ.250గా నిర్ణయిస్తూ ప్రకటన చేసింది కేంద్రం. టీకా ధరతో పాటు, సర్వీస్‌ ఛార్జ్ కలిపి ఈ ధరగా నిర్ణయించింది కేంద్రం. వ్యాక్సిన్‌ ధర రూ.150 కాగా.. సర్వీస్‌ ఛార్జిగా ఒక్కో వ్యక్తి నుంచి రూ.100 ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.

కొవిడ్‌ టీకా రెండు డోసుల్లో వేసుకోవాల్సి ఉండడంతో ‘ప్రైవేటు’లో ఒక్కో వ్యక్తి రూ.500 ఖర్చు చేయవలసిన అవసరం ఉన్నదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేసే వ్యాక్సిన్‌కు అయ్యే ఖర్చును మాత్రం కేంద్రమే భరించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలో ఇప్పటికే కరోనా టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం అవ్వగా.. మార్చి 1వ తేదీ నుంచి 60 ఏళ్ల పైబడినవారు.. 45నుంచి 60 ఏళ్ల మధ్యన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించారు.

దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఇందుకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేసుకుంటూ ఉండగా.. టీకా కొనుగోలు చేసే సామర్థ్యం ఉన్నవారికి ప్రైవేటు ఆస్పత్రుల్లో వేసుకునే వెసులుబాటు కల్పించాలనే కోరిక మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవాలనుకునేవారు ప్రైవేటు లేదా ప్రభుత్వమా అనేది వారే నిర్ణయించుకోవచ్చని కేంద్రం పేర్కొంది. ప్రభుత్వానికి చెందిన కొవిన్‌ 2.0 పోర్టల్‌ ద్వారా గానీ, ఆరోగ్య సేతు యాప్‌ ద్వారా గానీ, వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద గానీ పేరు నమోదు చేసుకోవలసి ఉంటుంది.