Flu Vaccine : ఫ్లూ వ్యాక్సిన్ తో కోవిడ్ నుండి రక్షణ…75వేల మందిపై అధ్యయనం చేసిన అమెరికన్ యూనివర్శిటీ

ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నవారు కరోనా బారిన పడినప్పటికీ అంత సీరియస్ కండీషన్ లోకి వెళ్ళే అవకాశాలు గణనీయంగా తగ్గిస్తుంది.

10TV Telugu News

Flu Vaccine : కరోనా మహమ్మారిపై వివిధ దేశాల్లో వివిధ రకాల ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలను వణికిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్న మహమ్మారిని లొంగదీసే ప్రయత్నాల్లో భాగంగా వివిధ రకాల ప్రయోగాలను అయా దేశాల వైద్యశాస్త్ర నిపుణులు చేపడుతున్నారు. తాజాగా అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ మియామి మిల్లర్ స్కూల్ ఆప్ మెడిసన్ తన తాజా అధ్యయనం ద్వారా కీలక విషయాన్ని వెల్లడించింది. ఇన్ ప్లూయెంజా (ఫ్లూ) కోసం వినియోగిస్తున్న వ్యాక్సిన్, కోవిడ్ 19 నుండి రక్షణ కల్పిస్తున్నట్లు పరిశోధనలో తేలినట్లు స్పష్టం చేసింది.

ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నవారు కరోనా బారిన పడినప్పటికీ అంత సీరియస్ కండీషన్ లోకి వెళ్ళే అవకాశాలు గణనీయంగా ఫ్లూ వ్యాక్సిన్ తగ్గిస్తుంది. కరోనా సోకిన తరువాత ఫ్లూ టీకా తీసుకున్నా మంచి ఫలితం లభించినట్లు పరిశోధకులు గుర్తించారు. అమెరికా, యుకే, జర్మనీ, ఇటలీ, ఇజ్రాయెల్, సింగపూర్ మరికొన్ని దేశాల్లోని 75వేల మందిపై మియామి యూనివర్శిటీ అధ్యయనం చేసింది. కోవిడ్ బాధితుల్లో గుండెపోటు, సెప్సిస్, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వంటి ఇతర అనారోగ్య పరిస్ధితులకు దారితీయకుండా కాపాడుతుందని తేల్చారు.

వివిధ దేశాల్లో ప్రస్తుతం వెలుగు చూస్తున్నకరోనా కొత్త వేరియంట్ల నుండి ఇది రక్షణ కల్పిస్తుందని మియామి మిల్లర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ దేవేందర్ సింగ్ తెలిపారు. కరోనా వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కోంటున్న దేశాల్లో ప్లూ టీకాను ఉపయోగించవచ్చని సూచించారు. కరోనా వ్యాక్సిన్ కు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని తేల్చిచెప్పారు. మరణం సంభవించే అవకాశాలను ఫ్లూ వ్యాక్సిన్ తగ్గించలేదని స్పష్టంచేశారు.

10TV Telugu News