నేటి నుంచి పల్స్‌ పోలియో.. హైదరాబాద్‌లో నాలుగు రోజులు

నేటి నుంచి పల్స్‌ పోలియో.. హైదరాబాద్‌లో నాలుగు రోజులు

Pulse polio vaccination : ఓ వైపు కోవిడ్‌ కట్టడికి వ్యాక్సినేషన్ దేశ వ్యాప్తంగా జరుగుతోంది. మరోవైపు ఇవాళ్టి నుంచి పల్స్‌ పోలియో వ్యాక్సినేషన్ జరగనుంది. పల్స్‌ పోలియో కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది. మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా జరగనున్న ఈ కార్యక్రమం…హైదరాబాద్‌లో మాత్రం నాలుగు రోజుల పాటు జరగనుంది.

నేటి నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు దేశవ్యాప్తంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు వైద్య ఆరోగ్య సిబ్బంది. రాష్ట్రపతి కోవింద్‌…శనివారం సాయంత్రం.. రాష్ట్రపతిభవన్‌లో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తొలుత ఈ కార్యక్రమాన్ని ఈ నెల 17న చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ భావించింది. అయితే కోవిడ్‌ వ్యాక్సినేషన్‌తో పల్స్‌ పోలియోను రెండువారాల పాటు వాయిదా వేశారు.

నిండు జీవితానికి రెండు చుక్కలు అంటూ…ఏటా రెండుసార్లు పల్స్‌ పోలియోను నిర్వహిస్తుంటుంది కేంద్రం. పోలియో చుక్కలు వేయించుకున్న చిన్నారులు అంగవైకల్యం భారినపడకుండా ఉంటారు. అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి ఐదేళ్ల లోపు వారికి పోలియో చుక్కలు వేస్తే… వ్యాధి భారినపడకుండా ఉంటారు. ప్రస్తుతం భారత్‌ పోలియోరహిత దేశంగా ఉంది. భారత్‌లో..చివరిసారి గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో 2011లో పోలియో కేసులు నమోదయ్యాయి. 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను పోలియోరహిత దేశంగా ప్రకటించింది.

ఈ ఏడు పోలియో డ్రాప్స్‌ సెంటర్లలో తప్పనిసరిగా కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి శానిటైజేషన్‌, గ్లోవ్స్‌, మాస్క్‌ధారణ తప్పనిసరి చేశాయి. వృద్ధులను పల్స్‌ పోలియో కేంద్రాలకు అనుమతించరు. దేశంలో మాదిరే తెలంగాణలోనూ మూడురోజుల పాటు పల్స్‌ పోలియో జరగనుంది. కానీ..రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నాలుగోరోజయిన ఫిబ్రవరి 3న కూడా కొనసాగనుంది. రాష్ట్రంలో 38 లక్షల 32 వేల మంది చిన్నారులకు 23 వేల 331 కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం 877 మొబైల్‌ టీమ్స్‌ పనిచేయనున్నాయి.

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు ప్రతి గ్రామంలోనూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ, ప్రభుత్వ వైద్యశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లలో పోలియో డ్రాప్స్‌ బూత్‌లలో ఈ కార్యక్రమం జరగనుంది. పోలియో డ్రాప్స్‌ కేంద్రాల్లోనే కాదు, ఇంటింటికి వెళ్లి కూడా పోలియో డ్రాప్స్‌ వేయనున్నారు ఫ్రంట్‌లైన్‌ హెల్త్‌ వర్కర్లు. బిడ్డల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా తల్లిదండ్రులంతా తమ తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని వైద్య నిపుణులు విజ్ఞప్తి చేశారు.