యాప్ లోనే ఆలయ దర్శనం

యాప్ లోనే ఆలయ దర్శనం

Siddhivinayak temple

Siddhivinayak temple : ఆలయంలోకి వచ్చే వారు తప్పనిసరిగా…యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని రావాల్సి ఉంటుందని, అందులోనే దర్శనం బుక్ చేసుకోవాల్సి ఉంటుందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. క్యూ ఆర్ కోడ్ చూపించిన వాళ్లకు మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుందంటున్నారు. కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్న వేళ..భారతదేశంలోని ప్రముఖ ఆలయాల్లో పలు నిబంధనలు మళ్లీ తీసుకొస్తున్నారు. పలు ఆంక్షల నడుమ..ధర్శనానికి అనుమతినిస్తున్నారు. షిర్డీ ఆలయంలో ప్రతి రోజు కేవలం 15 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతినిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా..ముంబైలోని సిద్ధి వినాయక ఆలయ అధికారులు కూడా పలు నిబంధనలు విధించారు.

మార్చి 02వ తేదీన అంగారక చతుర్థి రాబోతోంది. దీంతో ప్రముఖ ఆలయాలు కిక్కిరిసిపోతుంటాయి. ప్రస్తుతం కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతుండడంతో పలు నిబంధనలు ముందుకు తీసుకొస్తున్నారు. అలాగే..సిద్ధి వినాయక ఆలయానికి వచ్చే భక్తులకు ఆఫ్ లైన్ ఎంట్రీని నిషేధిస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. మార్చి 02వ తేదీ ఉదయం 8 గంటలకు ఆలయం తెరువనున్నట్లు, ఆన్ లైన్ రిజిస్టర్ చేసుకుని వచ్చే వారికి మాత్రమే ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. సిద్ధి వినాయక్ ఆలయ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని, అందులో దర్శనం బుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. రాత్రి 9 గంటలకు ఆలయం మూసివేస్తామన్నారు.

సకల విఘ్నాలకు అధిపతి ఆది దంపతుల కుమారుడు వినాయకుడు. ఆయన్ను పూజిస్తే..అన్ని సంకటాలు తొలగిపోతాయి. అందుకనే ప్రతిమాసంలో పౌర్ణమి అనంతరం వచ్చే చతుర్థినాడు సంకటహర చతుర్థిని నిర్వహిస్తారు. దీనినే సంకష్టహార చతుర్థి అని కూడా అంటారు. సంకష్ట హర చతుర్థి మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. సిద్ధి వినాయక ఆలయం పేరు గాంచింది. స్వామి వారిని దర్శించుకోవడానికి పలు రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడకు తరలివస్తుంటారు. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి.