Rahul Gandhi : రాహుల్ గాంధీ ట్విట్టర్ లో మాత్రమే యాక్టివ్..శివసేన

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై శివసేన విమర్శనాస్త్రాలు సంధించింది.

Rahul Gandhi : రాహుల్ గాంధీ ట్విట్టర్ లో మాత్రమే యాక్టివ్..శివసేన

Rahul (2)

Rahul Gandhi కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై శివసేన విమర్శనాస్త్రాలు సంధించింది. రాహుల్ గాంధీ ట్విట్టర్‌ లో మాత్రమే యాక్టివ్ గా ఉంటున్నారంటూ పార్టీ అధికార పత్రిక సామ్నాలో ఎద్దేవా చేసింది. మోడీ ప్రభుత్వం, ప్రభుత్వ విధానాలపై బాగానే విమర్శలు చేస్తున్నారని,అయితే ఆయన ట్విట్టర్‌కు మాత్రమే పరిమితమవుతున్నారని పేర్కొంది. మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో రాహుల్ గాంధీ విఫలం చెందారని తమ పత్రికలో రాసుకొచ్చింది. అదే సమయంలో విపక్షాలను ఏకం చేయడంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ విజయవంతమయ్యారని ప్రశంసలు కురిపించింది.

శరద్ పవార్ మాదిరిగా రాహుల్ గాంధీ కూడా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి ఉంటే ఆ ప్రతిపక్షం బలంగా ఉండి ఉండేదని వివరించింది. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు శరద్ పవార్ ఢిల్లీలోని తన నివాసంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం పట్ల అభినందనలు తెలిపింది. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు శరద్ పవార్‌ చేస్తున్న ప్రయత్నాలకు రాహుల్ గాంధీ మద్ధతు ఇవ్వాలని సూచించింది.

దేశంలో ప్రస్తుతం కేంద్రం ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు శివసేన పేర్కొంది. ప్రధాని మోడీ బాడీ లాంగ్వేజ్‌లో మార్పు వచ్చినట్లు పేర్కొంది. దేశంలో ప్రస్తుత పరిస్థితులు చేయిదాటి పోతోందన్న విషయం ప్రధాని మోడీకి కూడా తెలుసని వ్యాఖ్యానించింది. అయితే ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరిగినా తమ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకాలేదన్న ఆత్మవిశ్వాసం బీజేపీలో కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. దీనికి బలహీన, ఐక్యత లేని ప్రతిపక్షమే కారణమని దుయ్యబట్టింది. రాష్ట్రమంచ్‌కు కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించింది.

కాగా, ఇప్పటికే..వచ్చే ఎన్నికల్లో శివసేనతో పొత్తు ఉండబోదన్న మహారాష్ట్ర కాంగ్రెస్ నేతల ప్రకటనతో ఆ రెండు పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని విమర్శిస్తూ శివసేన వ్యాఖ్యలు చేయడం ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.