ఆకలికి ఆగలేక.. రైల్వే స్టేషన్‌లో ఫుడ్ ప్యాకెట్లను ఎత్తుకెళ్లిన వలస కార్మికులు

  • Published By: srihari ,Published On : May 26, 2020 / 03:38 AM IST
ఆకలికి ఆగలేక.. రైల్వే స్టేషన్‌లో ఫుడ్ ప్యాకెట్లను ఎత్తుకెళ్లిన వలస కార్మికులు

మధ్యప్రదేశ్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో వలస కార్మికులు దోపిడీకి పాల్పడ్డారు. ఫుడ్ సప్లయ్ చేసే బండిపై ఉన్న వస్తువులను దొంగిలించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొట్ట కూటి కోసం వలస వచ్చిన వలస కార్మికులు లాక్ డౌన్ కారణంగా సరైన ఆహారం, నీళ్లు లేక కొన్నిరోజులు నరకయాతన అనుభవిస్తున్నారు. గత కొన్నివారాలుగా వలసదారుల ఇక్కట్లకు సంబంధించి ఎన్నో వీడియోలు వైరల్ అవుతునే ఉన్నాయి. ఆకలితో వలసదారులు అలమటిస్తున్న పరిస్థితి నెలకొంది. మార్చి 25 లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఉపాధి లేక తినడానికి తిండి లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు.

ఏప్రిల్ నెలలో వలస కార్మికుల కోసం కేంద్రం రైల్వే సర్వీసులను రాష్ట్రాల మధ్య నడిపింది. ఈ సందర్భంగా ప్రయాణికులకు అవసరమైన ఆహారం, నీళ్లు అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ, కేంద్రం నుంచి వలస కార్మికులకు ఆశించిన స్థాయిలో రిలీఫ్ లభించలేదు. తాజా వీడియోలో కనిపించిన ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని నర్మదాపురం డివిజన్ Itarsi రైల్వే స్టేషన్ లో జరిగింది. స్పెషల్ ట్రైన్ 1869 శ్రామిక్ ట్రైన్ ప్లాట్ ఫాంపై కనిపిస్తోంది. అక్కడే ఉన్న వలసదారులు ఫుడ్ కార్ట్ పై ఉన్న వస్తువులను చుట్టుముట్టి ఎత్తుకెళ్లారు.

దగ్గరకు రావొద్దని రైల్వే సిబ్బంది ఎంతగా హెచ్చరించినా వారు వినలేదు. కానీ, వలస కార్మికులంతా ఒక్కసారిగా ఎగబడి అందినవరకు ఫుడ్ ప్యాకెట్లను తీసుకెళ్లిపోయారు. సెకన్ల వ్యవధిలోనే ఫుడ్ కార్ట్ ఖాళీ అయిపోయింది. భౌతిక దూరం పాటించాలంటూ ఒకవైపు రైల్వే సిబ్బంది హెచ్చరిస్తున్నప్పటికీ వారు పట్టించుకోలేదు. ఇదంతా అక్కడి వారు సెల్ ఫోన్లలో రికార్డు చేశారు.

Read: ఆరోగ్య సేతు యాప్ విస్తృత వినియోగం ఎందుకు అవసరం అంటే