వరుడి తండ్రి ఆదర్శం : రూ.11 లక్షల కట్నం వద్దండీ..రూ.101 చాలు..

వరుడి తండ్రి ఆదర్శం : రూ.11 లక్షల కట్నం వద్దండీ..రూ.101 చాలు..

Rajasthan Dowry free marriage : కట్నం అనేది సమాజంలో జాడ్యంలా పట్టుకుంది. ఆడపిల్లలను అత్తవారింటికి పంపించే సమయంలో వట్టి చేతులతో పంపించకూడదని..పసుపు, కుంకుమలతో పాటు కొంత ఆస్తిని కూడా ఇచ్చి పంపించే సంప్రదయాం కాస్త వరకట్నంగా మారింది. ఈ వరకట్నం దాహానికి ఎంతోమంది పడతులు బలైపోయిన ఘటనలు కోకొల్లలు. కానీ కట్నం వద్దు..మాఇంటికి వచ్చే అమ్మాయి సంతోషంగా రావాలని కోరుకునేవారు ప్రస్తుత సమాజంలో చాలా చాలా అరుదుగా కనిపిస్తారు. అటువంటి ఓ ఆదర్శవంతమైన పెళ్లి గురించి చెప్పుకోవాలి.

రాజస్థాన్‌లోని బూందీ జిల్లాలో పురాతన ఆచారాలకు స్వస్తి చెప్పిన ఓ పెళ్లి ఆదర్శప్రాయంగా మారి ఉదంతం చర్చనీయాంశంగా మారింది. రిటైర్డ్ ప్రిన్సిపాల్ బ్రజ్ మోహన్ మీణా టోంకా జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన యువతి ఆరతీ మీణాతో తన కొడుకుకు పెళ్లి నిశ్చయించారు. ఆరతీ బీఎస్సీ పూర్తి చేసి బీఈడీ చేస్తోంది.

ముహూర్తం కూడా పెట్టుకుని వివాహం జరిపించారు. వివాహంలో వధువు తండ్రి పళ్లెంలో నోట్ల కట్టలు పెళ్లి వరుని తండ్రి చేతిలో పెట్టాడు. మా ఇంటి అమ్మాయితో పాటు ఈ కట్నం కూడా స్వీకరించండి బావగారూ అంటూ అందించారు. దానికి వరుని తండ్రి ఆ కానుకను సున్నితంగా తిరస్కరించారు. ఆ నోట్ల కట్టలు పెట్టిన పళ్లాన్ని అందరికీ చూపిస్తూ..మాకు ఈ డబ్బులు అక్కర్లేదని..బంగారంలాంటి మీ అమ్మాయి మాత్రమే చాలు..అంటూ కట్నంగా ఆడపెళ్లివారు ఇచ్చిన రూ. 11 లక్షలను తిరిగి వారికి ఇచ్చేశారు. కానీ సంప్రదాయంగా కేవలం 101 రూపాయలు మాత్రం తన తీసుకుని మిగిలినవి వధువు తండ్రికి తిరిగి ఇచ్చేశారు.

ఈ సందర్భంగా వధువు ఆరతీ మీణా ఆనందం వ్యక్తం చేసింది. మా మామ చాలా మంచివారు..నేను చాలా అదృష్టవంతురాలిని ఇటువంటి ఆదర్శవంతమైన కుటుంబంలోని కోడలిగా వెళుతున్నందుకు అంటూ తెగ మురిసిపోయింది. నా తండ్రి ఇచ్చిన కట్నం డబ్బులను మా అత్తింటివారి తిరిగి ఇచ్చేశారని తెలిపింది. ఇది చాలామంచి పని అని అందరూ ఇలా ఆలోచిస్తే ఆడపిల్లను కనాలని ఎవ్వరూ భయపడరని తెలిపింది. సమాజంలో మగువకు తగిన గౌరవం అందించారని ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది ఆరతి మీణా.