వైసీపీ కార్పొరేటర్ దారుణ హత్య కేసులో సంచలన నిజాలు, మర్డర్‌కు కారణం ఇదే

వైసీపీ కార్పొరేటర్ దారుణ హత్య కేసులో సంచలన నిజాలు, మర్డర్‌కు కారణం ఇదే

reason behind kakinada corporator ramesh murder: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కలకలం రేపిన వైసీపీ కార్పొరేటర్ కంపర రమేష్ హత్య కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కంపర రమేష్ మర్డర్ కి కారణం ఏంటో పోలీసులు తెలిపారు. రియల్ ఎస్టేట్ సెటిల్ మెంట్ లో వచ్చిన వివాదం రమేష్ హత్యకు కారణమని చెప్పారు. మద్యం మత్తు, పిచ్చి కోపం కూడా తోడయ్యాయని తెలిపారు. రియల్ ఎస్టేట్ గొడవలే ఈ మర్డర్ కు కారణమైనట్టు ప్రాథమికంగా పోలీసుల విచారణలో తెలుస్తోంది.

కార్పొరేటర్ రమేష్ కు రియల్ ఎస్టేట్ వర్గాలతో సన్నిహిత సంబంధాలున్నాయి. చిన్నా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం తనకు రావాల్సిన డబ్బుని వేరే వ్యక్తికి ఇప్పించాడని రమేష్ పై చిన్నా పగ పెంచుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. అంతా మర్చిపోయారు అనుకున్న సమయంలో ఈ దారుణ హత్య జరిగింది.

నిన్న(ఫిబ్రవరి 11,2021) రాత్రి సూర్య కార్ వాష్ షెడ్డులో 9వ డివిజన్ కార్పొరేటర్ కంపర రమేష్ తన స్నేహితులతో మద్యం పార్టీ చేసుకుంటున్నాడు. అదే సమయంలో చిన్నా తన సోదరుడు కుమార్ తో కలిసి కారులో అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో రమేష్, చిన్నాల మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఆ సమయంలో చిన్నా వెళ్లిపోతుండగా.. అతడి కారుకి అడ్డుగా రమేష్ నిలబడ్డాడు. అప్పటికే పిచ్చి కోపంలో ఉన్న చిన్నా.. రమేష్ మీదకి కారుని ఎక్కించాడు. అలా మూడుసార్లు కారుని ఎక్కించి రమేష్ ని చంపేశాడు. సీసీకెమెరాలో ఇదంతా రికార్డ్ అయ్యింది. రియల్ ఎస్టేట్ లో తలెత్తిన వివాదం..దానికి తోడు మద్యం మత్తు, పిచ్చి కోపం ఈ దారుణ హత్యకు కారణం అయ్యాయని పోలీసులు తెలిపారు. రాత్రి 2 గంటల సమయంలో ఈ హత్య జరిగింది.

ఈ కేసులో నిందితుడు చిన్నా ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. దీనిపై మంత్రి కన్నబాబు స్పందించారు. చాలా దారుణంగా చంపారని అన్నారు. కారుతో గుద్ది చంపడం ఊహించలేకపోతున్నామన్నారు. కాకినాడ లాంటి ప్రశాంతమైన నగరంలో ఇలాంటి ఘటన జరగడం చాలా దారుణం అన్నారు. ఇందులో కుట్రకోణం ఏమైనా ఉందేమో అని అనుమానం వ్యక్తం చేసిన మంత్రి, ఆ దిశగా విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు.

కాకినాడ సిటీకి సంబంధించి కంపర రమేష్ చాలా కీలకమైన నాయకుడు అని మంత్రి చెప్పారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా, ఆవేశంలో జరిగిందా లేక కుట్ర ఉందా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉందన్నారు. కాకినాడ రూరల్ మండలం గంగరాజునగర్ లో జరిగిన ఈ ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది.

అసలేం జరిగిందంటే..
వాసు, సతీష్ తో కలిసి రమేష్ మద్యం సేవిస్తున్నాడు. ఆ సమయంలో కంపర రమేష్ కి చిన్నా ఫోన్ చేశాడు. చిన్నా అస్తమానం ఫోన్ చేస్తున్నాడని రమేష్ తన స్నేహితులతో చెప్పాడు. ఆ తర్వాత చిన్నాకి ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడిగాడు. తాను మూలపేటలో ఉన్నానని చిన్నా చెప్పాడు. నేను సూర్య కార్ వాష్ షెడ్డులో ఉన్నాను, నువ్వు 20 నిమిషాల్లో రా..అని.. చిన్నాతో రమేష్ ఫోన్ లో చెప్పాడు. అర్థరాత్రి 12గంటల సమయంలో చిన్నా, తన తమ్ముడు కుమార్ తో కలిసి కార్ షెడ్డుకి వచ్చాడు. అంతా కలిసి మద్యం సేవిస్తున్నారు.

12 నుంచి 2గంటల వరకు మద్యం సేవించారు. అదే సమయంలో వాగ్వాదం, ఘర్షణ కూడా జరిగింది. 2గంటల 11 నిమిషాలకు.. మాటలు కాస్తా వాగ్వాదానికి దారి తీశాయి. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. కొట్టుకున్నారు. చొక్కాలు కూడా చించుకున్నారు. రమేష్ కారు తాళం కనిపించకపోవడంతో వ్యవహారం మరింత ముదిరింది. చిన్నా, అతడి తమ్ముడికి రమేష్ స్నేహితులు సర్ది చెప్పారు. మీరు వెళ్లిపోండని కారు కూడా ఎక్కించారు. ఇదే సమయంలో కంపర రమేష్.. చిన్నా కారుకి అడ్డంగా నిలబడ్డాడు.

అప్పటికే తీవ్రమైన కోపంలో ఉన్న చిన్నా(పాత కక్షలు కావొచ్చు, మద్యం మత్తు కావొచ్చు).. కారుని కంపర రమేష్ మీది నుంచి పోనిచ్చాడు. అలా మూడుసార్లు కారుని ఎక్కించి రమేష్ ని చంపేశాడు చిన్నా. ఉద్దేశపూర్వకంగానే.. రమేష్ ని చిన్నా కారుతో తొక్కించి చంపినట్టు సీసీకెమెరాలోని ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. కాగా.. రమేష్, చిన్నా.. ఇద్దరూ స్నేహితులు.. కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సంబంధాలు ఉన్నాయి.