Heart : కోవిడ్ నుండి కోలుకున్నారా!…గుండెకు ముప్పు వాటిల్ల కుండా?…

కొందరిలో కోవిడ్ వచ్చి తగ్గిన 2వారాల వ్యవధిలోనే గుండె సంబంధిత సమస్యలు బయటపడుతుండగా మరికొందరిలో మూడునెలల తర్వాత హఠాత్తుగా సమస్య ఉత్పన్నమౌతుంది.

Heart : కోవిడ్ నుండి కోలుకున్నారా!…గుండెకు ముప్పు వాటిల్ల కుండా?…

Heart : కరోనా మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. కోవిడ్ నుండి కోలుకున్నప్పటికీ చాలా మంది దాని ప్రభావం వల్ల వివిధ రకాల వ్యాధులకు లోనై మృత్యవాత పడుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులు, ఇతర ఇన్ఫెక్షన్లతో చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ ప్రభావం గుండెపై తీవ్రంగా ఉంటుంది.

గుండె సాఫీగా పనిచేసేందుకు ఆక్సిజన్ ఎంతో అవసరం. ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు గుండె సరఫరా చేస్తుంది. ఊపిరితిత్తుల ద్వారా ఆక్సిజన్ గుండెకు సరఫరా అవుతుంది. కరోనా వైరస్ వచ్చిన రోగుల్లో ముందుగా ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీని వల్ల ఆక్సిజన్ స్ధాయిలు తగ్గిపోతున్నాయి. ఆక్రమంలో గుండెకు అందాల్సిన ఆక్సిజన్ ను ఊపిరితిత్తుల నుండి సక్రమంగా అందకపోవటంతో గుండె కండరాలు దెబ్బతింటున్నాయి. రక్తాన్ని సరఫరాచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. దీని ఫలితంగా గుండె కొట్టుకునే వేగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గుండె కొట్టుకునే వేగంపెరుగుతుంది. కొందరిలో ఈ సమస్యలు ముందే గుర్తించకుండా ఉంటే అలాంటి వారిలో గుండెపోటులు స్వల్ప వ్యవధిలోనే సంభవిస్తున్నాయి.

ముఖ్యంగా మధుమేహం,, ఊబకాయం, రక్తపోటు ఉన్నవారు కోవిడ్ వస్తే మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వీరిలో గుండె సంబంధిత సమస్యలు చుట్టుముట్టే అవకాశం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది ఇంట్లోనే సొంత వైద్యం ద్వారా కోవిడ్ నుండి కోలుకుంటున్నారు. అయితే కేవలం కొంతమందిలో మాత్రం వారు కోలుకున్నట్లు అనిపించినా దాని ప్రభావం మాత్రం శరీరంపై కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి వారు 100మందిలో 20 మంది ఉంటున్నారు. వీరికే గుండె సంబంధిత సమస్యలు అధికంగా వస్తున్నట్లు పలు అధ్యయనాల్లో కనుగొన్నారు.

కొందరిలో కోవిడ్ వచ్చి తగ్గిన 2వారాల వ్యవధిలోనే గుండె సంబంధిత సమస్యలు బయటపడుతుండగా మరికొందరిలో మూడునెలల తర్వాత హఠాత్తుగా సమస్య ఉత్పన్నమౌతుంది. శ్వాస తీసుకోలేకపోవటం, ఛాతి నొప్పి, ఉన్నట్టుండి గుండె వేగం పెరగడం, గుండె కొట్టుకునే వేగం తగ్గటం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. రక్తం గడ్డకట్టం వంటి కారణాల వల్ల ఛాతిలో నొప్పి వస్తుంది. దీని వల్ల గుండె పోటు రావటం, శ్వాస తీసుకోవటం ఇబ్బందులు తలెత్తటం వంటివి చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే తక్షణం వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది. ఏమాత్రం అశ్రద్ధ చేసినా ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశాలు అధికంగా ఉంటాయి.

ఇలాంటి పరిస్ధితుల సమయంలో ఆరోగ్యం విషయంలో సరైన జాగ్రత్తలు పాటించటం మంచిది. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మంచి విశ్రాంతి తీసుకోవాలి. అలసటకు గురికాకుండా ఉండాలి. మద్యం, పొగ మానేయాలి. పళ్లు, కూరగాయలతో పాటు వంటకాల్లో ఉప్పు తక్కువగా వాడుకోవాలి. నీటిని ఎక్కవగా తాగాలి. దీని వల్ల రక్తం గడ్డకట్టే ముప్పు తక్కువగా ఉంటుంది. వైద్యుల సూచనల మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకుని వారు సూచించిన విధంగా మందులను వాడుకోవాలి.