BL Santhosh : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. బీఎల్ సంతోష్‌కు హైకోర్టులో రిలీఫ్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. 41ఏ సీఆర్పీసీ నోటీసుల అమలుపై డిసెంబర్ 5వ తేదీ వరకు స్టే విధించింది న్యాయస్థానం.

BL Santhosh : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. బీఎల్ సంతోష్‌కు హైకోర్టులో రిలీఫ్

BL Santhosh : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సిట్ జారీ చేసిన 41ఏ సీఆర్పీసీ నోటీసుల అమలుపై డిసెంబర్ 5వ తేదీ వరకు స్టే విధించింది న్యాయస్థానం.

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో సిట్ జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని బీఎల్ సంతోష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. బీఎల్ సంతోష్ తరపున న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. ఫిర్యాదులో బీఎల్ సంతోష్ పేరు లేనప్పుడు నిందితుల జాబితాలో ఎలా చేరుస్తారని ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. కాగా, ఈ కేసులో బీఎల్ సంతోష్ ప్రమేయంపై పక్కా ఆధారాలు ఉన్నాయని అడ్వకేట్ జనరల్ వాదించారు.

ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ కీలక నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పేరు కూడా తెరపైకి రావడం సంచలనం రేపింది. ఈ కేసు విచారణ చేపట్టిన తెలంగాణ సిట్.. బీఎల్ సంతోష్ ను కూడా నిందితుల జాబితాలో చేర్చింది. విచారణకు రావాలంటూ ఆయనకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కాగా, తనను నిందితుడిగా పేర్కొని నోటీసులు ఇవ్వడం పట్ల బీఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఆరోపణలు చేస్తోందని, సంబంధం లేని వ్యవహారంలో తన పేరును ప్రచారం చేస్తున్నారని బీఎల్ సంతోష్ తన పిటిషన్ లో ఆరోపించారు. సీఆర్పీసీ నోటీసులను రద్దు చేయాలని హైకోర్టును కోరారు.

ఈ మేరకు సంతోష్ తరఫు న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు బీఎల్ సంతోష్ కు ఊరట కలిగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

సిట్ జారీ చేసిన నోటీసుల అమలును నిలుపుదల చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 5కి వాయిదా వేసింది.

ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి బీఎల్ సంతోష్, కేరళ ఎన్డీయే కన్వీనర్ తుషార్, డాక్టర్ జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చింది సిట్.