రూ.వెయ్యి మాత్రమే విత్ డ్రా చేయాలి, ఆ బ్యాంకు కస్టమర్లకు ఆర్బీఐ షాక్

రూ.వెయ్యి మాత్రమే విత్ డ్రా చేయాలి, ఆ బ్యాంకు కస్టమర్లకు ఆర్బీఐ షాక్

Rs 1000 withdrawal limit for next 6 months: కర్ణాటక కేంద్రంగా పనిచేస్తున్న దక్కన్‌ అర్బన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్‌(Deccan Urban Co-operative Bank Ltd) కార్యకలాపాలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఆ బ్యాంకు ఖాతాదారులు(సేవింగ్స్, కరెంట్) వెయ్యి రూపాయలు మాత్రమే క్యాష్ విత్ డ్రా చేసేలా పరిమితి విధించింది. అలాగే కొత్తగా లోన్స్ ఇవ్వడం, నిధులు సమీకరించుకోవడం, డిపాజిట్లు స్వీకరించడం పూర్తిగా నిలిపివేయాలని బ్యాంకును ఆదేశించింది.

కొత్తగా ఎక్కడా పెట్టుబడులు కూడా పెట్టొద్దని తెలిపింది. బ్యాంకు పేరిట ఉన్న ఆస్తుల్ని కూడా అమ్మొద్దని స్పష్టం చేసింది. ఎలాంటి చెల్లింపులు కూడా చేయొద్దంది. ఈ మేరకు బ్యాంకు సీఈవోకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆంక్షలు ఫిబ్రవరి 19 సాయంత్రం నుంచి ఆరు నెలల పాటు అమల్లో ఉంటాయంది.

అదే సమయంలో బ్యాంకు ఖాతాదారులకు కొంత ఊరటనిచ్చే ప్రయత్నం చేసింది ఆర్బీఐ. ఖాతాదారుల్లో 99.58 శాతం మంది ‘డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కోఆపరేషన్‌(డీఐసీజీసీ)’ కింద నమోదై ఉన్నారని.. వారందరికీ బీమా రూపంలో భద్రత లభిస్తుందని ఆర్బీఐ తెలిపింది.

ఆంక్షలు విధించినంత మాత్రాన బ్యాంకు లైసెన్స్‌ రద్దు చేసినట్లు కాదని స్పష్టం చేసింది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే వరకు కొన్ని పరిమితులు కొనసాగుతాయని తెలిపింది. పరిస్థితుల్ని బట్టి ఎప్పటికప్పుడు ఆంక్షల్లో సడలింపులిస్తామంది. బ్యాంకులో ప్రస్తుతం ఉన్న నగదు నిల్వలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆంక్షలు విధించినట్టు ఆర్బీఐ వెల్లడించింది.