ఒకే కంపెనీలో రూ. 220కోట్ల నల్లధనం.. ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకే లెక్క చూపించలేదా?

ఒకే కంపెనీలో రూ. 220కోట్ల నల్లధనం.. ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకే లెక్క చూపించలేదా?

తమిళనాడు రాష్ట్రంలో చెన్నై నగరంలో ఒక ప్రముఖ కంపెనీలో దాదాపు రూ. 220కోట్ల నల్లధనం బయటపడింది. శానిటరీవేర్ తయారీదారులపై దాడి చేసిన తరువాత ఆదాయపు పన్ను శాఖ సుమారు రూ.220కోట్లు ఆదాయాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) తెలిపింది. టైల్స్‌ అండ్‌ శానిటరీవేర్‌ తయారీ కంపెనీపై ఇన్‌కమ్‌ టాక్స్‌ అధికారులు జరిపిన దాడిలో లెక్కల్లో చూపని డబ్బు వెలుగుచూసిందని అధికారులు వెల్లడించారు.

ఫిబ్రవరి 26వ తేదీన జరిపిన సోదాల్లో మొదట రూ.8.30 కోట్లు సీజ్‌ చేసినట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్స్‌ అధికారులు తెలపగా.. టైల్స్‌కు సంబంధించి లెక్క చూపని కొనుగోలు, అమ్మకాలు జరిగినట్లు గుర్తించారు అధికారులు. ఇందుకోసం ఓ రహస్య ఆఫీసుతో పాటు, ఓ సాఫ్ట్‌వేర్‌ను సైతం ఉపయోగించినట్లు కనుగొన్నారు అధికారులు.

యాభై శాతానికి పైగా లావాదేవీలు రికార్డు చేయలేదని, రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి ఈ డబ్బును ఉపయోగించాలని అనుకున్నారా? అనేదానిపై కూడా విచారణ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.