Exclusive: టీటీడీకి రూ.300కోట్ల విరాళం.. అసలు కథేంటి? ముంబై కంపెనీ మాయ చేస్తోందా..?

Exclusive: టీటీడీకి రూ.300కోట్ల విరాళం.. అసలు కథేంటి? ముంబై కంపెనీ మాయ చేస్తోందా..?

Mumbai Company Cheating Ttd

తిరుపతిలో అత్యాధునిక వసతులతో చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని 300 కోట్ల రూపాయలతో నిర్మించేందుకు ముంబైకి చెందిన ఉద్వేగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చిందంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన చేసింది. టీటీడీ చేసిన ప్రకటన భక్తులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఎందుకంటే.. 300 కోట్ల రూపాయలంటే మాటలు కాదు.. బహుశా విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణ దేవరాయులు ఏనాడో చేసిన దానాలను మినహాయిస్తే.. టీటీడీకి ఈ స్థాయిలో దానం ఇచ్చేందుకు ముందుకొచ్చింది ఉద్వేగ్ సంస్థ మాత్రమే.

ఆగర్భశ్రీమంతుడు.. వెంకటేశ్వరస్వామిని అమితంగా ఆరాధించే ముఖేశ్ అంబానీ కూడా ఈ స్థాయిలో ఇప్పటివరకు టీటీడీకి విరాళం ఇవ్వలేదు. మరి అంబానీకి మించినంత సంపద ఉద్వేగ్ సంస్థ అధినేత దగ్గర ఉందా..? అసలు ఈ ఉద్వేగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ పూర్వాపరాలేంటి..? ఈ సంస్థకు ఆ స్థాయిలో విరాళం ఇచ్చే శక్తి నిజంగానే ఉందా..? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. వీటికి సమాధానాలు వెదికేందుకు 10టీవీ చేసిన ప్రయత్నాల్లో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

300 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వాలంటే.. ఎంత సంపద ఉండాలి. సంపదలో పదిశాతాన్ని దేవుడిపై భక్తితో ఇచ్చారనుకున్నా కనీసం 3 వేల కోట్ల సంపద ఉండాలి. లేదు.. సగానికి సగం ఇచ్చేశారనుకున్నా 600 కోట్ల రూపాయలు ఉండాలి.. అదీలేదు దేవుడి కోసం ఉన్నదంతా ఇచ్చేసారనుకున్నా 300 కోట్లు ఉండాల్సిందే. కానీ.. 10టీవీ చేసిన పరిశోధనలో ఉద్వేగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అసలు గుట్టు బయటకు వచ్చింది. టీటీడీ తలపెట్టిన పిల్లల ఆస్పత్రిని 300 కోట్ల రూపాయలతో నిర్మించడానికి MOU కుదుర్చుకున్న ఉద్వేగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ మూలధనం కేవలం లక్ష రూపాయలే.

ముంబైలోని హీరానందిని ఎస్టేట్ రోడ్‌లో ఉన్న ఈ సంస్థ డైరెక్టర్లు సంజయ్‌ కేదార్‌నాథ్‌ సింగ్‌, వందనా సింగ్‌లకు ఇందులో చెరి ఐదువేల చొప్పున పదివేల షేర్లు ఉన్నాయి. ఒక్కో షేరు పదిరూపాయల చొప్పున ఇద్దరికీ కలిపి ఉన్న షేర్ల విలువ కేవలం లక్షరూపాయలే. ఇందులోనుంచి ఉద్వేగ్‌ సంస్థకు ఇప్పటివరకు వచ్చిన నష్టాలను మినహాయిస్తే, ఆ సంస్థ నికర విలువ 2020 మార్చి నాటికి అక్షరాలా 26 వేల 634 రూపాయలు. కరోనా కష్ట కాలంలో ఈ సంస్థకు గత ఏడాది అల్లాడిన్ అద్భుత దీపంలాగా ఒక్కసారిగా వేలకోట్లు వచ్చి పడితే తప్ప ఈ స్థాయిలో విరాళం ఇవ్వడం సాధ్యం కాదనేది సుస్పష్టం.

దేశవ్యాప్తంగా ఐటీ పార్కులు, సెజ్‌లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, హైక్లాస్ విల్లాలు.. ఒక్కటేమిటి రియల్‌ ఎస్టేట్‌లో దుమ్ముదులిపేస్తున్నామంటూ టీటీడీ ముందు కలరింగ్ ఇచ్చుకున్నారు ఉద్వేగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డైరెక్టర్‌ సంజయ్‌ కేదార్‌నాథ్‌ సింగ్‌. నిజంగా అంత సీన్ ఉందా అంటూ వెబ్‌సైట్‌లో చూస్తే.. అన్నీ కంప్యూటర్‌లో తీర్చిదిద్దిన గ్రాఫిక్సే తప్ప.. ఒక్కటి కూడా రియల్ ఫోటో కనిపించలేదు. ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా వివరాలేవీ లేవు. ఒకరకంగా చెప్పాలంటే అంతా గ్రాఫిక్స్ మాయాజాలమే.

ఇక ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్లను తీసి చూస్తే.. 2019-20 ఆర్థిక సంవత్సరానికి వచ్చిన రెవెన్యూ కేవలం 49 వేల 900 రూపాయలు మాత్రమే. ఇదే సమయంలో సంస్థ నిర్వహణకు పెట్టిన ఖర్చు లక్షా 25 వేల రూపాయలు. ఈ లెక్కన ఆ కంపెనీకి వచ్చిన నష్టం 75 వేల రూపాయలు. ఆడిట్ రిపోర్ట్‌ కూడా దీన్ని కన్‌ఫామ్ చేసింది. ఇలా లక్ష రూపాయల మూలధనం, లక్ష లోపు ఆదాయం, కేవలం 26 వేల 634 రూపాయల నికర విలువ ఉన్న ఓ కంపెనీ.. ఏకంగా తిరుపతిలో 300 కోట్ల రూపాయల విరాళంతో చిన్న పిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పెట్టేందుకు ఎలా ముందుకు వచ్చింది..? నిజంగా ఆ సంస్థకే ఇంత భారీ స్థాయిలో విరాళం ఇచ్చే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఉద్వేగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ డైరెక్టర్‌ సంజయ్ కేదార్‌నాథ్ సింగ్‌తో రూ. 300కోట్ల విరాళంతో పిల్లల ఆస్పత్రి నిర్మించేందుకు శుక్రవారం MOU కూడా కుదుర్చుకున్న టీటీడీ సంస్థ.. ఇందుకు సంబంధించి కనీస కసరత్తు చేసి సాధ్యాసాధ్యాలను అసలు పరీశిలించిందా అనే అనుమానం వస్తోంది. పైగా ఆస్పత్రి నిర్మాణం కోసం పది ఎకరాల స్థలాన్ని కూడా ఇచ్చేందుకు టీటీడీ ముందుకు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది… టీటీడీ ఈవో కూడా ఇవాళ వెళ్లి ఉద్వేగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఏ స్థలాన్ని కేటాయించొచ్చు అన్నదానిపై పరిశీలన జరిపారు.

అయితే.. ఇక్కడ ఇలాంటిదే మరో విషయాన్ని కూడా తెలుసుకోవాలి. కేరళలోని చోటానిక్కర భగవతి దేవస్థానానికి 500 కోట్ల రూపాయల విరాళం ఇచ్చేందుకు కొచ్చిన్‌లోని దేవేశ్వర బోర్డును బెంగళూరుకు చెందిన గణశ్రావణ్‌ అనే భక్తుడు 2020 నవంబర్‌లో సంప్రదించాడు. అయితే.. ఇంత భారీ మొత్తంలో విరాళం స్వీకరించే విషయంలో తర్జన భర్జన పడిన ఆ దేవస్థానం బోర్డు.. కాస్త ముందూ వెనుకా ఆలోచించి.. ఈ డబ్బు ఎలా వచ్చిందో ఆధారాలు చూపాలంటూ ఆ భక్తుడిని కోరింది. అంతేకాదు భారీ మొత్తం కావడంతో ఎందుకైనా మంచిదని కేరళ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికీ తీసుకెళ్లింది. మరో అడుగు ముందుకు వేసి… కేరళ హైకోర్టుకు కూడా విషయాన్ని నివేదించాలని ఆ దేవస్థానం బోర్డు అభిప్రాయపడింది.

కేరళలోని ఓ చిన్న ఆలయమే భారీ విరాళం స్వీకరించే విషయంలో ఇంత ఆలోచిస్తే.. దేశంలోనే అతిపెద్ద ఆలయం అయిన టీటీడీ ఇంకెంత ఆలోచించాలి..? భారీ స్థాయి విరాళాలు తీసుకునే విషయంలో ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలి..? ఈ విషయం అలా ఉంచితే.. టీటీడీ పిల్లల ఆస్పత్రికి 300 కోట్ల రూపాయల విరాళం ప్రకటించి, ఏకంగా MOU కుదుర్చుకున్న ముంబై భక్తుడు సంజయ్‌ కేదార్‌నాథ్ సింగ్‌కు నిజంగా అంత ఆర్థిక శక్తి ఉందా..? ఇదంతా కలా.. వైష్ణవ మాయా..? లేదా కలియుగ వైకుంఠనాథుడి మహిమా..? కాలమే సమాధానం చెప్పాలి. ఈ భారీ విరాళం నిజమవుతుందా లేదా అనే విషయాన్ని టీటీడీనే తేల్చాలి.