జగన్‌కు, షర్మిలకు సంబంధం లేదు.. తెలంగాణలో పార్టీ పెట్టాలనే ఆలోచనకు జగన్ వ్యతిరేకం

జగన్‌కు, షర్మిలకు సంబంధం లేదు.. తెలంగాణలో పార్టీ పెట్టాలనే ఆలోచనకు జగన్ వ్యతిరేకం

sajjala ramakrishna reddy on sharmila party: వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు షర్మిల. ఇప్పుడీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైఎస్ షర్మిల కొత్త పార్టీపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల పార్టీ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదని ఆయన తెలిపారు. 3 నెలలుగా షర్మిల పార్టీపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. షర్మిల మా అందరి ఆత్మీయ సోదరి అని సజ్జల చెప్పారు.

జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ రాజకీయాలపై జగన్ స్పష్టమైన వైఖరితో ఉన్నారని సజ్జల చెప్పారు. రెండు రాష్ట్రాల పరస్పరం సహకరించుకోవాలన్నదే జగన్ ఆలోచన అన్నారు. జగన్ కు, షర్మిలకు ఎలాంటి విబేధాలు లేవని సజ్జల స్పష్టం చేశారు. పార్టీ వద్దని షర్మిలకు నచ్చజెప్పే ప్రయత్నాలు జరిగాయన్నారు. ఆమె వ్యక్తిగత నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నారని వివరించారు. వైఎస్ కుటుంబంలో పదవుల విషయంలో ఎలాంటి గొడవలు లేవని సజ్జల చెప్పారు.

తెలంగాణలో రాజకీయాలు చేస్తే ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటాయని జగన్ తమతో చెప్పారని సజ్జల తెలిపారు. ఇదే కారణంతో తెలంగాణలో పార్టీ విస్తరణపై దృష్టి పెట్టలేదన్నారు. ఇలా తెలంగాణలో పార్టీ పెట్టాలనే ఆలోచనకు తాము వ్యతిరేకమన్నారు. షర్మిల పెట్టే పార్టీతో తమకు ఎలాంటి సంబంధం లేదని సజ్జల స్పష్టం చేశారు. షర్మిలతో ఎలాంటి విబేధాలు లేవన్న ఆయన భిన్నాభిప్రాయాలు మాత్రం ఉన్నాయన్నారు. కాగా, అన్నగా షర్మిలకు జగన్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు:
కాగా, టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు అందరికీ అందడం లేదని విమర్శించారు. రైతులు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ అందరికీ అందుతుందా అని అడిగారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎన్నేళ్లైంది.. పక్కా ఇళ్లు అందరికీ వచ్చాయా అని ప్రశ్నించారు.

మళ్లీ రాజన్న రాజ్యం రావాలన్న షర్మిల.. రాజన్న రాజ్యం రావాలని అందరూ కోరకుంటున్నారని తెలిపారు. రాజన్న రాజ్యం మనతోనే సాధ్యమని తన నమ్మకం అన్నారు. తాను తెలంగాణ కోసం అంకితభావంతో కృషి చేస్తానని చెప్పారు. రాజన్న సువర్ణ పాలన తెచ్చేందుకే వచ్చానన్నారు. జగన్.. ఏపీలో పని చేస్తున్నారని..తాను తెలంగాణకు కమిటెడ్ గా పని చేయాలనుకుంటున్నట్లు వివరించారు. వైఎస్ఆర్ పై అభిమానం చెక్కు చెదరలేదన్న షర్మిల.. వైఎస్ పాలనలో రైతు రాజులా బతికాడన్నారు.