ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఒక్కొ ఓటరుకి రూ.8వేలు, కమలాపురం సర్పంచి అభ్యర్థి ఆఫర్

ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఒక్కొ ఓటరుకి రూ.8వేలు, కమలాపురం సర్పంచి అభ్యర్థి ఆఫర్

sarpanch candidate offer 20 lakhs: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. నామినేషన్ల ప్రక్రియ జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ప్రలోభాలు మొదలయ్యాయి. ఒక్కోచోట ఒక్కో రకమైన ప్రలోభం నడుస్తోంది. గ్రామాభివృద్ధికి డబ్బులు ఇస్తామని అభ్యర్థులు ముందుకు రావడంతో చాలా గ్రామాల్లో సర్పంచ్ పదవి ఏకగ్రీవం అవుతోంది. మరికొన్ని చోట్ల పదవి కోసం వేలం పాటలు నిర్వహిస్తున్నారు. ఎవరు ఎక్కువకు పాడుకుంటే వారిని ఏకగ్రీవం చేస్తున్నారు. ఆ విధంగా వచ్చిన సొమ్ముని గ్రామాభివృద్ధికి ఖర్చు చేయాలని గ్రామ పెద్దలు నిర్ణయిస్తున్నారు.

అయితే, కడప జిల్లా కమలాపురం మండలంలోని ఓ గ్రామంలో ఇందుకు భిన్నంగా జరిగింది. ఓ సర్పంచి అభ్యర్థి ఇచ్చిన ఆఫర్ చర్చకు దారితీసింది. ఇక్కడ సర్పంచ్ పదవి జనరల్‌కు కేటాయించారు. గ్రామంలో 240 ఓట్లు ఉన్నాయి. ఈ పంచాయతీకి రెండో దశలో ఎన్నిక జరగాల్సి ఉండగా వైసీపీకి చెందిన ఓ అభ్యర్థి పోటీకి ముందుకొచ్చాడు.

తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ. 20 లక్షలు ఇస్తానని ఆ వ్యక్తి ఆఫర్ ఇచ్చాడు. అయితే, ఈ సొమ్ము గ్రామాభివృద్ధి కోసమని కాకుండా, వ్యక్తిగతంగా ఒక్కో ఓటరుకు రూ. 8 వేల చొప్పున పంచాలని ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. దీంతో పోటీ చేయాలని భావిస్తున్న ఇతర అభ్యర్థులను బరిలోంచి తప్పించేందుకు గ్రామ పెద్దలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.