దుస్తులు విప్పి అందాలు చూపించండి.. ఆన్‌లైన్ క్లాసుల పేరుతో హెడ్‌మాస్టర్ పాడుపని

దుస్తులు విప్పి అందాలు చూపించండి.. ఆన్‌లైన్ క్లాసుల పేరుతో హెడ్‌మాస్టర్ పాడుపని

school head master harass students: గురువంటే దైవంతో సమానం. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తాడు. వారు సన్మార్గంలో పయనించేలా, ప్రయోజకుల్లా తయారయ్యేలా చూస్తాడు. అందుకే గురువుకి సమాజంలో ఎంతో గౌరవం, మర్యాద ఉంది. అయితే కొందరు టీచర్లు కీచకుల్లా మారుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెస్తున్నారు. కోరిక తీర్చాలని కొందరు టీచర్లు లైంగిక వైధింపులకు పాల్పడుతున్నారు.

కామారెడ్డి జిల్లాలో కీచక హెడ్ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం బయటపడింది. ఆన్‌లైన్ క్లాసుల పేరుతో విద్యార్థినుల నుంచి ఫోన్ నెంబర్లు సేకరించిన ప్రధానోపాధ్యాయుడు, వారికి వీడియో కాల్ చేసి.. దుస్తులు విప్పి అందాలు చూపించాలని వారిని వేధిస్తున్నాడు. కామారెడ్డి జిల్లా నల్లమడుగు తండాకు చెందిన రాము అనే విద్యార్థి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అకారణంగా రాముకి టీసీ ఇచ్చి పంపించినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన రాము ఆత్మహత్యకు యత్నించాడు.

విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ప్రధానోపాధ్యాయుడే కారణమని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు కామారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదుట నిరసనకు దిగాయి. ఇదే క్రమంలో సదరు ప్రధానోపాధ్యాయుడి వేధింపుల గురించి స్కూల్ విద్యార్థినులు బయటపెట్టారు. కరోనా లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి ఆన్‌లైన్ క్లాసుల పేరుతో తమను వేధింపులకు గురిచేస్తున్నట్లు చెప్పారు. క్లాసులు చెప్పేందుకు వీడియో కాల్ చేసి… అందాలు చూపించాలని వేధించేవాడని వాపోయారు.

గతంలోనూ డ్యాన్స్ క్లాసుల పేరుతో అతను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. వ్యక్తిగతంగా డ్యాన్స్ నేర్పిస్తానని ఒక్కొక్కరిని గదిలోకి తీసుకెళ్లి వేధించేవాడన్నారు.

కాగా, ఆన్ లైన్ క్లాసుల పేరుతో విద్యార్థినులకు హెడ్ మాస్టర్ అసభ్యకర వీడియోలు పంపేవాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆ కాల్స్ కి సంబంధించిన ఓ వీడియోని రాము అనే విద్యార్థి వైరల్ చేశాడు. ఈ కారణంతోనే రాముకి టీసీ ఇచ్చినట్టు తెలుస్తోంది. హెడ్ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం దుమారం రేపడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ఆ కీచక హెడ్ మాస్టర్ ని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.