వైఎస్ షర్మిల కొత్త పార్టీ.. టీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా? జంప్ అయ్యేది ఎవరు?

వైఎస్ షర్మిల కొత్త పార్టీ.. టీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా? జంప్ అయ్యేది ఎవరు?

sharmila new party plus or minus for trs: తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్నట్టు వైఎస్ షర్మిల చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరీ ముఖ్యంగా తెలంగాణలోని అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. షర్మిల పార్టీ పెడితే లాభమా? నష్టమా? అనే కోణంలో లెక్కలు వేసుకుంటోంది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఎవరైనా ఆ పార్టీలోకి జంప్ అవుతారా? జంప్ అయ్యేవారు ఎంతమంది?

తెలంగాణ వచ్చాక వైఎస్ ఫ్యామిలీ రాజకీయాలు ఏపీకి షిప్ట్ అయ్యాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ఆ కుటుంబం మళ్లీ తెలంగాణ పాలిటిక్స్ పై దృష్టి సారించింది. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడానికి ప్రయత్నిస్తానని షర్మిల ప్రకటించారు. ఎన్నికలకు మరో రెండు మూడేళ్ల సమయం ఉండటంతో పక్కా ప్రణాళికతోనే రాష్ట్రంలో పొలిటికల్ ఎంట్రీకి షర్మిల సిద్ధమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

షర్మిల తెలంగాణలో పార్టీ పెడితే పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయాలపై టీఆర్ఎస్ నేతల్లో చర్చలు మొదలయ్యాయి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న వారిలో ఒకరిద్దరు మినహా చాలామందికి కీలక పదవులు లేవు. ఈ పరిస్థితుల్లో ఆ నేతలు టీఆర్ఎస్‌లో ఉంటారా? వైఎస్ పై అభిమానంతో షర్మిలకు దగ్గరవుతారా? అన్న చర్చ జరుగుతున్నట్టు సమాచారం.

ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీతో పాటు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు షర్మిల పార్టీలోకి వెళ్తారా వెళ్లరా అని చర్చించుకుంటున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు వైఎస్ ఫ్యామిలీతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. షర్మిల పార్టీ వల్ల టీఆర్ఎస్ కు ఎంతవరకు లాభం, ఎంతవరకు నష్టం అన్న కోణంలో నేతలు లెక్కలు వేస్తున్నారు.

కాగా, కొంతమంది టీఆర్ఎస్ నేతలు షర్మిల పార్టీ ఏర్పాటుపై సోషల్ మీడియాలో స్పందించారు. అయితే కొద్దిసేపటికే ఆ పోస్టులను తొలగించడం చర్చకు దారితీసింది.