Janasena Party Symbol: జనసేనకు షాక్.. గాజు గ్లాసు గుర్తు మరో పార్టీకి!

ఎన్నికల కమిషన్ జనసేన-బీజేపీ కూటమికి భారీ షాక్ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. ఈ ఎన్నికలలో గాజు గ్లాసు గుర్తును ఈసీ నవతరం పార్టీకి కేటాయించింది. గాజు గ్లాసంటే.. అందరికీ గుర్తొచ్చేది జనసేన పార్టీనే

Janasena Party Symbol: జనసేనకు షాక్.. గాజు గ్లాసు గుర్తు మరో పార్టీకి!

Shock To Janasena Glass Symbol To Another Party

Janasena Party Symbol: జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏదో చేయాలని ఆరాటపడుతున్నారు కానీ రాజకీయంగా ఆయనకు కలిసి రావడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పోటీచేసిన రెండు స్థానాలలో ఓడిపోయినా ఏ మాత్రం నిరుత్సాహపడకుండా పార్టీ బలోపేతం కోసం ప్రయతిస్తున్నారు. ఈక్రమంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకొని కలిసికట్టుగా ఎన్నికలకు వెళ్తున్నారు. అయితే.. ఇక్కడ కూడా బీజేపీ కేవలం తమను మిత్రపక్షంగానే చూస్తుందని.. ఎన్నికలలో పోటీచేసే అవకాశం ఇవ్వడం లేదని జన సైనికుల ఆవేదనతో ఉన్న మాట నిజమే. ముఖ్యంగా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలలో పోటీచేయాలని జనసేన చాలా ప్రయత్నాలు చేసింది.

కానీ.. అక్కడ జనసేనకు ఆ అవకాశం ఇవ్వకుండానే బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. తొలుత పవన్ కళ్యాణ్ అసంతృప్తిలో ఉన్నారని వార్తలొచ్చినా చివరికి శనివారం రోజున ప్రచారానికి దిగారు. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభను గెలిపించాలని పవన్ ప్రచారం చేశారు. ఒకవైపు అధికార వైసీపీ డాక్టర్ గురుమూర్తిని రంగంలోకి దింపి గెలుపు ధీమాతో దూసుకెళ్తుంటే… ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సీనియర్ నేత పనబాక లక్ష్మిని దించి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే.. ఎన్నికల కమిషన్ జనసేన-బీజేపీ కూటమికి భారీ షాక్ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. ఈ ఎన్నికలలో గాజు గ్లాసు గుర్తును ఈసీ నవతరం పార్టీకి కేటాయించింది.

గాజు గ్లాసంటే.. అందరికీ గుర్తొచ్చేది జనసేన పార్టీనే. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా జనసేన ఈ గుర్తుతోనే బరిలో నిలిచింది. ఆ గుర్తుతోనే గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా రాష్ట్రంలోనే ఉన్నారు. పేదవాడి చాయ్ గ్లాస్ గా జనసేన తమ పార్టీ గుర్తుగా దాన్ని తీవ్రంగా ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు తిరుపతి ఎన్నికలలో జనసేన పోటీలో లేకపోగా ఆ గుర్తు మరో పార్టీకి వెళ్ళింది. నిజానికి ఒక పార్టీ గుర్తులను ఈసీ మరో పార్టీ అభ్యర్థులకు కేటాయించదు. కానీ జనసేన పార్టీకి ఇప్పటికీ గుర్తింపు లేకపోవడంతోనే ఇలా ఆ గుర్తు మరో అభ్యర్థికి కేటాయించినట్లుగా తెలుస్తుంది.

మొత్తం గాజు గ్లాసు ఇప్పుడు మరో పార్టీకి కేటాయించడం ఇక్కడ బీజేపీ-జనసేన వర్గాన్ని కలవరపెడుతున్నట్లుగా తెలుస్తుంది. బీజేపీ జనసేన అండతో ఏపీలో శక్తిగా ఎదగాలని చూస్తుంది. అందుకు తిరుపతి బైపోల్ వేదికగా చూసుకుంది. అటు పవన్ కళ్యాణ్ తో పాటు తెలంగాణలో లీడర్లతో కూడా తిరుపతి ప్రచారం చేయిస్తుంది. కానీ అనుకోకుండా ఇలా గాజు గుర్తు రూపంలో షాక్ తగలడం ఆసక్తిగా మారింది. తమ ఉమ్మడి అభ్యర్థికి వేయాలనుకున్న ఓటర్లు గాజు గ్లాసు మరో పార్టీకి కేటాయించడంతో ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉందని ఆందోళనలో ఉన్నట్లుగా తెలుస్తుంది.