Sputnik Light: సింగిల్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ “స్పుత్నిక్ లైట్” కు రష్యా ఆమోదం

ప్రపంచదేశాల్లో కరోనాతో పోరాటం కొనసాగిస్తున్న సమయంలో రష్యా నుంచి మరొక కోవిడ్ వ్యాక్సిన్

Sputnik Light: సింగిల్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ “స్పుత్నిక్ లైట్” కు రష్యా ఆమోదం

Sputnik Light Single Dose Covid Vaccine With 80 Efficacy Approved By Russia

Sputnik Light ప్రపంచదేశాలు కరోనాతో పోరాటం కొనసాగిస్తున్న సమయంలో రష్యా నుంచి మరొక కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పుడు అందుబాటులోకి రానుంది. కరోనా కట్టడి కోసం అభివృద్ధి చేసిన సింగిల్ డోస్ వెర్షన్ “స్పుత్నిక్ లైట్” కు రష్యా ఆరోగ్య అధికారులు ఆమోదం తెలిపారు.

స్పుత్నిక్ లైట్ వేగవంతమైన మరియు నమ్మదగిన పాండమిక్ ఫైటర్. ఉన్నత స్థాయి రక్షణను సాధించడంలో ఇది వేగంగా సహాయపడుతుంది. వైరస్ పెరుగుదలను వేగంగా ఓడించడానికి మరియు సమాజంలో శాశ్వత రక్షణను సృష్టించడానికి సహాయపడుతుంది అని స్పుత్నిక్ ఒక ట్వీట్‌లో తెలిపింది.

రెండు డోసుల స్పుత్నిక్ వీ టీకా సామ‌ర్థ్యం 91.6 శాతం కాగా, సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ టీకా సామ‌ర్థ్యం 79.4 శాత‌మ‌ని గురువారం స్పుత్నిక్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ర‌ష్యాలో డిసెంబర్-5,2020 నుంచి ఏప్రిల్-15,2021 వరకు నిర్వ‌హించిన వ్యాక్సినేష‌న్‌ డ్రైవ్ అనంత‌రం 28 రోజుల‌ త‌ర్వాత సేక‌రించిన డేటా ఆధారంగా సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ సామ‌ర్థ్యాన్ని అంచ‌నా వేసిన‌ట్లు వెల్ల‌డించింది.

మ‌రోవైపు ర‌ష్యా క‌రోనా టీకా స్పుత్నిక్ వీని 64 దేశాలు ఆమోదించాయి. భారత్ కూడా ఇటీవల దేశంలో అత్యవసర వినియోగానికి స్పుత్నిక్ వీని ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే యూరోపియ‌న్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ), అమెరికాలోని ఫుడ్ అండ్ డ్ర‌గ్స్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎఫ్‌డీఏ) మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు దీనిని ఆమోదించ‌లేదు.