Tie Rakhi For Bail: బాధితురాలితో రాఖీ కట్టిస్తే బెయిల్ ఇచ్చేస్తారా..

లైంగిక వేధింపుల కేసులో నిందితుడు బాధితురాలితో రాఖీ కట్టించుకునే షరతు మీద బెయిల్ మంజూరు చేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తప్పు పట్టింది.

Tie Rakhi For Bail: బాధితురాలితో రాఖీ కట్టిస్తే బెయిల్ ఇచ్చేస్తారా..

Sc Scraps Mp High Court’s ‘rakhi’ Order

Tie Rakhi For Bail: లైంగిక వేధింపుల కేసులో నిందితుడు బాధితురాలితో రాఖీ కట్టించుకునే షరతు మీద బెయిల్ మంజూరు చేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తప్పు పట్టింది. వేధింపులకు పాల్పడిన వ్యక్తిని సోదరుడిగా మార్చే ఆ తీర్పు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. దీంతో పాటు లైంగిక వేధింపుల కేసుల విచారణలో న్యాయమూర్తులు పాటించాల్సిన మార్గదర్శకాలు జారీ చేసింది.

వేధింపుదారుతో బాధితురాలి మునుపటి సమ్మతి, ప్రవర్తన, ధరించిన దుస్తులు లాంటి విషయాలను తీర్పులో ఎన్నటికీ పరిగణించకూడదని స్పష్టం చేసింది. లైంగిక వేధింపుల కేసులో ఉన్న ఓ వివాహితుడికి బెయిల్ మంజూరు చేస్తూ మధ్య ప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు చర్చనీయాంశమైంది.

నిందితుడు బాధితురాలి ఇంటికి భార్యతో కలసి మిఠాయిలు తీసుకుని వెళ్లి రాఖీ కట్టమని అభ్యర్థించాలి. భవిష్యత్తులో ఆమెకు రక్షణగా ఉంటానని హామీ ఇవ్వాలని ఆ తీర్పులో హైకోర్టు ఆదేశించింది. బాధితురాలితో నిందితుడి కాంటాక్ట్ ను ప్రోత్సహించేలా ఉన్న ఈ తీర్పుపై విమర్శలు వచ్చాయి. దాన్ని రద్దు చేయాలంటూ పలువురు సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ ఎస్ రవీంద్రతో భట్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం హైకోర్టు తీర్పును కొట్టివేసింది.

అది లైంగిక వేధింపుల నేర తీవ్రతను తగ్గించేలా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ నేరం క్షమాపణలు చెప్పడం, సమాజ సేవ చేయడం, బాధితురాలికి రాఖీ కట్టడం, పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడం ద్వారా మన్నించేంత చిన్నది కాదని పేర్కొంది. కోర్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితురాలిని తక్కువ చేసే వ్యాఖ్యానాలు చేయకూడదని స్పష్టం చేసింది. బెయిల్ షరతులు బాధితురాలికి నిందితుడి నుంచి మరిన్ణి వేధింపులు ఎదురవకుండా కాపాడాలి తప్ప వారితో కాంటాక్ట్ ను ప్రోత్సహించేలా ఉండకూడదని పేర్కొంది.

బెయిల్ ఇచ్చిన ప్రతి కేసులోనూ ఆ సమాచారం బాధితులకు తెలియజేయాలని చెప్పింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లు సహా న్యాయవాదులకు, న్యాయ మూర్తులకు కేసుల్లో సున్నితత్వంతో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది.