గ్రహణం వల్ల గర్భిణులకు కీడు జరుగుతుందా, ఆహారం తినొచ్చా

ఖగోళంలో అద్భుతం ఆవిష్కృతమైంది. అరుదుగా సంభవించే పూర్తి స్థాయి వలయాకార సూర్యగ్రహణం

గ్రహణం వల్ల గర్భిణులకు కీడు జరుగుతుందా, ఆహారం తినొచ్చా

ఖగోళంలో అద్భుతం ఆవిష్కృతమైంది. అరుదుగా సంభవించే పూర్తి స్థాయి వలయాకార సూర్యగ్రహణం

ఖగోళంలో అద్భుతం ఆవిష్కృతమైంది. అరుదుగా సంభవించే పూర్తి స్థాయి వలయాకార సూర్యగ్రహణం ఆదివారం(జూన్ 21,2020) ఏర్పడింది. సూర్యుడికి చంద్రుడు అడ్డు రావ‌డంతో గ‌గ‌నత‌లంలో వ‌ల‌యాకార సుంద‌ర దృశ్యం కనువిందు చేస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆదివారం ఉద‌యం 9.15 గంట‌లకు సూర్య‌గ్ర‌హ‌ణం మొద‌లు కాగా, ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లో మాత్రమే ఇది సంపూర్ణంగా కనిపిస్తోంది. భారత్‌లోనే మిగతా ప్రాంతాల్లో పాక్షికంగా దర్శనం ఇస్తోంది. ఈ ఏడాదిలో ఇదే తొలి సూర్యగ్రహణం. ఇది పాక్షిక సూర్య గ్రహణం కాగా డిసెంబర్‌ 14న ఏర్పడబోయేది సంపూర్ణ సూర్యగ్రహణం.

రింగ్ ఆఫ్ ఫైర్ కనువిందు:
దేశవ్యాప్తంగా తీసుకుంటే సూర్యగ్రహణం ఉదయం గం.9:15 గంటలకు మొదలైంది. మధ్యాహ్నం 12:10 గంటలకు అత్యున్నత స్థితికి చేరుకుంది. మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాలకు గ్రహణం ముగిసింది. అయితే ప్రాంతాలను బట్టి సమయంలో కాస్త మార్పులు ఉన్నాయి. గ్రహణం తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి 1.44 గంటల వరకు 51 శాతం గ్రహణం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.21 గంటల నుంచి మధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం గ్రహణం ఉంది. విశ్వవ్యాప్తంగా 3గంటల 33 నిమిషాలపాటు గ్రహణం ఉంది. ఈసారి వచ్చిన సూర్యగ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటున్నారు. ఇది ఏర్పడే సమయంలో భూమి, సూర్యుడి మధ్యలో చందమామ అడ్డుగా వస్తుంది. చందమామ పూర్తిగా సూర్యుడిని మూసివేసినప్పుడు… నల్లటి చందమామ చుట్టూ… రింగ్ లాంటి ఆకారం ఏర్పడుతుంది. అదే రింగ్ ఆఫ్ ఫైర్ అంటున్నారు.

చూడామణి సూర్యగ్రహణం:
భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడి ప్రవేశంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడిని చంద్రుడు కప్పేయడం కారణంగా భూమిపై చంద్రుడి నీడ మాత్రమే కన్పిస్తుంది. ఈ సూర్యగ్రహణం ఒక్క అమావాస్య రోజున మాత్రమే జరుగుతుంది. జ్యోతిషం ప్రకారం.. శార్వరీ నామ సంవత్సరం జ్యేష్ట బహుళ అమావాస్య ఆదివారం మృగశిర నక్షత్రం, మిథున రాశిలో రాహుగ్రస్త ఖండగ్రాస సూర్యగ్రహణం సంభవించింది. ఇది దక్షిణభారతంలో ఖండగ్రాసం, ఉత్తర భారతంలో కంకణాకారంలో కనిపిస్తుంది. దీన్నే ‘చూడామణి యోగం’ అని ధర్మశాస్త్రం చెబుతుంది.

సూర్యకిరణాలు ప్రభావం చూపుతాయా? గర్భిణులకు కీడు జరుగుతుందా? గ్రహణం సమయంలో ఆహారం తినకూడదా? 
ఆదివారం, పైగా అమావాస్య. దీంతో ఈ రోజు ఏర్పడిన సూర్యగ్రహణాన్ని ప్రత్యేకంగా చూస్తున్నారు. అసలు జూన్ 21వ తేదీన ఆదివారం రోజున ఏర్పడిన సూర్యగ్రహణం ప్రత్యేకత ఏంటి? సూర్యకిరణాలు ప్రభావం చూపుతాయా? గర్భిణులకు కీడు జరుగుతుందా? గ్రహణం సమయంలో ఆహారం తినకూడదా? ఆహార పదార్దాలు చెడిపోతాయా? దర్భ ఎందుకు వాడాలి? ఇలాంటి సందేహాలు, అనుమానాలు ఎన్నో అందరి మెదళ్లను తొలుస్తున్నాయి. పండితుల వెర్షన్ ఎలా ఉన్నా హేతువాదులు మాత్రం ఇదంతా ట్రాష్ అంటున్నారు. గ్రహణం వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు.

రాహుగ్రస్త సూర్యగ్రహణం ప్రత్యేకత:
ఖగోళంలో ఏర్పడే సూర్య లేదా చంద్రగ్రహణం చూడటానికి ఒక అద్భుతం అని టెన్ టీవీ డిబెట్ లో ప్రముఖ జ్యోతిష్యులు నాగరాజు తెలిపారు. రాహుగ్రస్త సూర్యగ్రహణం అని గురించి మాట్లాడిన ఆయన.. సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి పదకొండేళ్లు పడుతుందన్నారు. ఈ సమయంలో సూర్యుడిపై స్పాట్స్ ఏర్పడుతాయని, వీటిని సన్ స్పాట్స్ అంటారని, వీటికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. 11 ఏళ్లకు ఒకసారి స్పాట్స్ లో ఉన్న రేడియేషన్ ను అంతరిక్షం, భూమీ మీదకు వెదజల్లుతుందని తెలిపారు. దాన్ని కాంతి వికరణం అంటారని అన్నారు. దాని వల్ల భూమికున్న ఆయస్కాంత క్షేత్రంలోని శక్తి కూడా కొంత క్షీణిస్తుందని, దాని వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు. .

గ్రహణం సమయంలో ఆహారం విషం అవుతుందా? ఆహారం తింటే అజీర్తి అవుతుందా?
గ్రహణం సమయంలో ఆహారం విషం అవుతుందా? గ్రహణం సమయంలో ఆహారం తింటే అజీర్తి అవుతుందా? అనే సందేహాలకు జ్యోతిష్యులు నాగరాజు వివరణ ఇచ్చారు. ”పూర్వ కాలంలో మనకు ఫ్రిడ్జిలు వంటి ప్రిజర్వేటిస్ లేవు. ఆ కారణంగానే దర్బలు వేసేవాళ్లు. కోయంబత్తూరులోని శాస్త్రా యూనివర్సీటీ దర్భపై రీసెర్చ్ చేసింది. పూర్వం మన దేశంలో ఎక్కువగా ఆవు పాలను వాడేవారు. గ్రహణ సమయంలో ఆవు పాలను తోడు వేసి పేరబెడితే కొంత పాయిజన్ గా మారే అవకాశం ఉంది. గుడ్ బ్యాక్టీరియా వల్ల పెరుగుగా మారుతుంది. కానీ గ్రహణ సమయంలో చెడ్డ బ్యాక్టీరియా ఏర్పడుతుందని పరిశోధన లో ఉంది. ఈ రోజుల్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఆహారం నిల్వ చేసుకోవడానికి ఫ్రిడ్జిలు వంటివి ఉన్నాయి. కాబట్టి గ్రహణం సమయంలో ఆహారం తినొచ్చు, ఇబ్బంది లేదు అని జ్యోతిష్యులు నాగరాజు స్పష్టం చేశారు.

గ్రహణం వల్ల గర్భిణులకు కీడు జరుగుతుందా?
దీనిపై స్పందించిన జ్యోతిష్యులు నాగరాజు.. గర్భం దాల్చిన సమయంలో జాగ్ర్తతా ఉండాలని చెబుతారు. గర్బిణుల్లో హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతూ ఉంటాయి. ప్రతి నెల గర్భంలో ఉన్న శిశవు పెరిగే కొద్దీ హార్మోన్స్ ఎక్సేంజ్ అవుతూ ఉంటాయి. దాని వల్ల వారి మానసిక స్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. మానసిక స్థితిని మెరుగుపరచడానికే కొన్ని నియమాలు, జాగ్రత్తలు చెప్పారు తప్ప వాటిని మూఢ నమ్మకం కోసం చెప్పింది కాదు అని ఆయన అన్నారు. సో, గ్రహణం కిరణాల వల్ల గర్బిణులకు కీడు జరుగుతుందనేది, ఆహారం తింటే విషం, అజీర్తి అవుతందనేది అపోహ మాత్రమే అని ఆయన తేల్చి చెప్పారు. పూర్వ కాలంలో ఆహారాన్ని నిల్వ చేసుకునేందుకు అప్పుడేమీ సౌకర్యాలు లేవు కనుక జాగ్రత్తలు పాటించే వారని చెప్పారు. ఇప్పుడు అలాంటి ఇబ్బందేమీ లేదన్నారు.

* ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటేనే ఆహార పదార్దాలు పాడవుతాయి
* సూర్యకిరణాలతో ఎలాంటి ప్రభావం ఉండదు
* గర్భిణులకు ఎలాంటి కీడు జరగదు
* గ్రహణాన్ని నేరుగా చూడొద్దు
* మొబైల్ తో ఫొటోలు, వీడియోలు తీయకూడదు
* సోలార్ ఎక్లిప్స్ గ్లాసెస్ ను వాడాలి
* కడుపులో బిడ్డపై చెడు ప్రభావం అనేది అపోహ మాత్రమే
* విగ్రహాలు ముట్టుకోకూడదనేది అపోహ

Read: పెద్ద ఎత్తున సైబర్‌ దాడులు.. జాగ్రత్తగా ఉండండి: కేంద్రం హెచ్చరికలు