14 నెలలుగా యువకుడి ఛాతిలో కత్తి.. పాపం తెలియనేలేదట!

మనల్ని మనం నమ్మలేని.. ఊహకు అందని కథనాలు అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. ఇప్పుడు మీరు చదవబోయే స్టోరీ కూడా అలాంటిదే. సహజంగా మన శరీరంలో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే విలవిలలాడిపోతాం. మరి అలాంటిది ఓ యువకుడు తన శరీరంలోనే 14 నెలలుగా కత్తి దాగి ఉన్నా తెలియనేలేదట.

14 నెలలుగా యువకుడి ఛాతిలో కత్తి.. పాపం తెలియనేలేదట!

Sword In The Chest Of A Young Man For 14 Months

మిరాకిల్.. వైద్య శాస్త్రంలోనే ఇదో అరుదైన ఘట్టం అనే డైలాగులు అప్పుడప్పుడు మనం సినిమాలలో చూస్తుంటాం. వాళ్ళకి మాత్రం ఎక్కడ నుండి వస్తాయి. వాళ్ళు కూడా మన సమాజంలోనే నుండే కదా సేకరించేది. మనల్ని మనం నమ్మలేని.. ఊహకు అందని కథనాలు అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. ఇప్పుడు మీరు చదవబోయే స్టోరీ కూడా అలాంటిదే. సహజంగా మన శరీరంలో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే విలవిలలాడిపోతాం. అంతెందుకు డాక్టర్ ఇంజెక్షన్ చేస్తామంటేనే చాలు కొందరు ఇల్లు పీకి పందిరేసినంత గోల చేస్తుంటారు. మరి అలాంటిది ఓ యువకుడు తన శరీరంలోనే 14 నెలలుగా కత్తి దాగి ఉన్నా తెలియనేలేదట. అది కూడా ఛాతి భాగంలోనే ఆ కత్తి నెలల తరబడి దాగి ఉండడం గమనార్హం.

అసలు విషయం ఏమిటంటే.. ఫిలిప్పీన్స్ కు చెందిన కెంట్ ర్యాన్ తొమావో అనే 36 ఏళ్ల యువకుడు ఒక జాబ్‌కి అప్లై చేసుకున్నాడు. ఆఫీస్ వాళ్లు హెల్త్ రిపోర్ట్ కావాలని అడగడంతో హెల్త్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు ఛాతి మీద ఒక గాయం గురించి అడిగారు. గత ఏడాది కత్తి గుచ్చుకుందని చెప్పడంతో రొటీన్ చెకప్‌లో భాగంగా ఎక్స్‌రే తీశారు. ఎక్స్ రే చూసిన వైద్యులకు మైండ్ బ్లాంక్ అయినంత పనయింది. ఛాతిలో నాలుగు అంగుళాల కత్తి దాగి ఉందని చెప్పడంతో అవాక్కవడం కెంట్ వంతయింది. అసలు ఆ కత్తి గుచ్చుకున్న రోజు ఏమైందో చెప్పారా బాబు టెన్షన్ పెట్టాడకుండా అని వైద్యులు అడగడంతో కెంట్ గత ఏడాది జరిగిన ఉదంతం గురించి చెప్పాడు.

గతేడాది 2020 జనవరిలో కెంట్ ఆఫీసు నుండి ఇంటికి నడుస్తూ వెళ్తుండగా కిదపావన్ నగరంలో అతనిపై దాడి జరిగింది. దుండగులు కెంట్ ఛాతిలో కత్తితో పొడిచి పారిపోయారు. ఆ సమయంలో కత్తి విరిగిపోయి హ్యాండిల్ ముక్క ఎక్కడో పడిపోగా రక్తం కారుతుంటే సమీపంలో ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి డాక్టర్లు కెంట్ గాయాన్ని శుభ్రం చేసి కుట్లు వేసి కట్టు కట్టారు. గాయం తగ్గేందుకు, నొప్పికి మందులు ఇచ్చి పంపేయగా కొన్ని రోజులకు గాయం నయమైంది. అనంతరం కెంట్ ఎప్పట్లాగే ఆఫీసుకు వెళ్లడంతో పాటు తన పని తాను చేసుకుపోతున్నాడు. ఇప్పుడు కొత్తగా మరో జాబ్ కు అప్లై చేయడంతో మెడికల్ టెస్టుకు వెళ్ళాడు.

మరి ఇన్నాళ్లుగా కత్తి అతని ఛాతిలోనే ఉన్నా నొప్పి లేదా అనుకోవచ్చు. ఏదో చలికాలంలో కొద్దిగా నొప్పి మినహా పెద్దగా నొప్పి లేదట. గాయం మానడంతో కెంట్ కూడా ఆ గాయం గురించి మర్చిపోయాడు. కెంట్ అదృష్టం ఏమిటంటే గత ఏడాది ఘటనలో దుండగులు కత్తిని ఛాతిలో దింపినా అది ఊపిరితిత్తులకు పక్కాగా.. ఎముకల గూడులోకి వెళ్ళింది. మరికాస్త అదృష్టం కొద్దీ ఏడాదికి పైగా ఆ కత్తి ఎలాంటి హాని చేయకుండా కుదురుగా అక్కడే ఉండడం విశేషం. ఇక ఎలాగూ విషయం బయటపడడంతో ప్లీజ్ ఇప్పుడు జాగ్రత్తగా ఆ కత్తిని బయటకి తీసేయండి డాక్టర్ అని కెంట్ బ్రతిమాలుకుంటున్నారట. త్వరలోనే ఆ ఆపరేషన్ కూడా జరగనుంది.