షూటింగ్ లు ఎలా : చిరంజీవి ఇంట్లో కీలక భేటీ..మంత్రి తలసాని హాజరు

  • Published By: madhu ,Published On : May 21, 2020 / 05:47 AM IST
షూటింగ్ లు ఎలా : చిరంజీవి ఇంట్లో కీలక భేటీ..మంత్రి తలసాని హాజరు

ప్రముఖ నటుడు చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. 2020, మే 21వ తేదీ గురువారం ఉదయం ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా పాల్గొన్నారు. సినీ రంగంపై కరోనా ప్రభావం, షూటింగ్స్‌, థియేటర్లకు అనుమతి అంశాలపై చర్చిస్తున్నారు. ఈ భేటికి రాజమౌళి, అల్లు అరవింద్‌, దిల్‌రాజు, హీరో నాని, శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి.. జెమిని కిరణ్‌, కొరటాల శివ, త్రివిక్రమ్‌, నిర్మాతలు సి.కళ్యాణ్‌, రాధాకృష్ణ, నాగ వంశీ హాజరయ్యారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఇప్పటికే సినీ ప్రముఖులతో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ రెండు సార్లు భేటీ అయ్యారు. ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధిపై చర్చించిన సంగతి తెలిసిందే. 

కరోనా కారణంగా తెలుగు చిత్రపరిశ్రమ స్తంభించిపోయింది. గత 50 రోజులకు పైగానే షూటింగ్ లకు ప్యాకప్ చెప్పారు. 25 వరకూ పెద్ద సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. కొన్ని రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. షూటింగ్ మధ్యలోనే ఆగిపోవడంతో దర్శక, నిర్మాతలు, ఇతరులపై పెను ప్రభావం పడింది. ఇండస్ట్రీపై ఆధారపడ్డ లక్షల మందికి ఉపాధి కరువైంది. లాక్‌డౌన్ నిబంధనలు సడలించినా సినిమా షూటింగ్‌లకు మాత్రం ఇంకా అనుమతి రాలేదు. ఒకవేళ షూటింగ్‌లు మొదలైనా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియట్లేదు.

థియేటర్లు ఓపెన్‌ అయినా ప్రజలు పెద్దగా ఆసక్తి చూపుతారా లేదా అన్న సందేహం ఉంది. ఈ అంశాలన్నింటిపై చిరు ఇంట్లో జురుగుతున్న సమావేశంలో చర్చిస్తున్నారు. చిత్ర పరిశ్రమ కోలుకునేలా షూటింగ్స్‌ ఎలా ప్రారంభించాలి…? థియేటర్స్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి…? అన్నదానిపై ఓ కార్యాచరణ సిద్దం చేసే అవకాశం ఉంది. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియకపోవడంతో కొంతమంది నిర్మాతలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సినిమాలు రిలీజ్‌ చేస్తున్నారు. దీనిపై చర్చిస్తున్నారు. 

Read: దటీజ్ ఉపాసన : కండోమ్స్ తో డిజైన్ చేసిన డ్రస్ వేసుకుని..ఇది వేసుకునే ధైర్యం ఉందాంటూ ఛాలెంజ్