డీఎంకే లెక్క తేలింది.. 187చోట్ల అదే గుర్తుపై!

డీఎంకే లెక్క తేలింది.. 187చోట్ల అదే గుర్తుపై!

తమిళనాడు రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ఎన్నికల్లో పొత్తులు.. ఎత్తులు విషయంలో కీలక నిర్ణాయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 174 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఉదయించే సూర్యుడు చిహ్నం కింద తమిళనాడులోని 187 నియోజకవర్గాల్లో డీఎంకే కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఏప్రిల్ 6 న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

2016వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో డీఎంకే పార్టీ మొత్తం 178 స్థానాల్లో పోటీ చెయ్యగా.. ఈసారి మాత్రం నాలుగు స్థానాలు తగ్గించుకుని 174స్థానాల్లో పోటీ చేస్తోంది. కమల్ హాసన్ నేతృత్వంలోని మూడవ కూటమి లెక్కతేలినా, ఎవరైనా వస్తారనే ఎదురుచూపుల్లో మూడో కూటమి ఉంది. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు మరో రోజు మాత్రమే సమయం ఉండగా.. మార్చి 12వ తేదీ నుంచి రాజకీయ పార్టీ అభ్యర్థులు నామినేషన్‌లు వెయ్యనున్నారు.

ఈ క్రమంలోనే రాష్ట్ర అసెంబ్లీలోని 234 స్థానాల్లో డీఎంకే 174స్థానాల్లో, కాంగ్రెస్‌ 25, సీపీఎం 6, సీపీఐ 6, వీసీకే 6, ఎండీఎంకే 6స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌కు 3స్థానాలు.., మనిదనేయ మక్కల్‌ కట్చికి 2స్థానాలు, కొంగు మక్కల్‌ దేశీయ కట్చికి 3స్థానాలు.. తమిళర్‌ వాల్వురిమై కట్చికి ఒకటి చొప్పున సీట్లు కేటాయించారు. మరో రెండు చిన్న పార్టీలకు తలా ఒక సీటు ఇచ్చారు.

సీట్ల లెక్కలు తేలడంతో ఇప్పుడు కూటమిలోని ఆయా పార్టీలు తమకు కావాల్సిన నియోజకవర్గాలు, అభ్యర్థుల ఎంపి0కపై దృష్టిపెట్టాయి. చెన్నైలో డీఎంకే 14 స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు ఉండగా.. ఎండీఎంకేతో పాటు చిన్న పార్టీల అభ్యర్థులు డీఎంకే చిహ్నంతో ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఇక ఎవరైనా కలిసి వచ్చినా వారు డీఎంకే చిహ్నంపై పోటీ చేయాలని అంటున్నారు.

అన్నాడీఎంకేలో మాత్రం సీట్ల సర్దుబాటు ఇంకా కుదరలేదు. అన్నాడీఎంకే కూటమిలో పీఎంకేకు మాత్రం 23 సీట్లు కేటాయించగా.. బీజేపీకి 20 ఇచ్చినట్లు చెబుతున్నారు. కానీ, అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆ కూటమిలోని డీఎండీకే, తమిళ మానిల కాంగ్రెస్‌తో సీట్ల లెక్కలు ఇంకా తేలలేదు..