అమ్మ జ్ఞాపకాల్లో : ఫీనిక్స్ పక్షి ఆకారంలో జయ మొమోరియల్..

అమ్మ జ్ఞాపకాల్లో : ఫీనిక్స్ పక్షి ఆకారంలో జయ మొమోరియల్..

Tamilnadu : EX CM Jaya lalitha Memorial shape of a phoenix bird : తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్ర అసామాన్యం. అనిర్వచనీయం.అనితరసాధ్యం. ‘అమ్మ’ అంటే జయమ్మే. తమిళుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న మాజీ సీఎం జయలలిత పేరు చిరస్థాయిగా మిగిలిపోతుంది. ఆమే మాటే శాసనంగా వెలుగొందారు జయలలిత. ఆమె పేరు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయేందుకు ‘జయ మెమోరిల్’ భవనం రూపుదిద్దుకుంది. మెరీనా తీరంలో సుందరమైన ఆకృతి సిద్ధమైంది. ‘ఫీనిక్స్ పక్షి ఆకారంలో జయ మెమోరియల్ భవనం రూపుదిద్దుకుంది. ఈ భవనంతో పాటు ఆ ప్రాంగణం అంతా ప్రకృతే కొలువుతీరిందా అన్నట్లుగా కనువిందు చేస్తోంది..

‘ఫీనిక్స్’పక్షి ఆకారంలో జయ మెమోరియల్..
ఎటు చూసినా మనసును ఆహ్లాదపరిచే పచ్చదనం. అరుదైన పూలమొక్కలు, చరిత్రను నిరంతరం గుర్తు చేసే చిహ్నాలు. మైమరిపించే చలువరాతి నిర్మాణాలు, రాత్రా పగలా అన్నట్లుగా మిరిమిట్లు గొలిపే విద్యుద్దీపకాంతులు..ఇవీ జయమొమోరియల్ ఆకృతిలో అందమైన దృశ్యాలు.. తమిళనాడు చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ సీఎం జయలలిత స్మారక మందిరం..! ఈ స్మారక మందిరాన్ని సీఎం పళనిస్వామి ప్రారంభించారు.

చరిత్రకు సాక్ష్యంగా రూ.80కోట్ల నిర్మించిన జయ మెమోరియల్
2016 డిసెంబర్‌ 5న కన్నుమూసిన జయలలిత భౌతిక కాయాన్ని ఆమె రాజకీయ గురువు, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌ సమాధి వెనుకవైపున ఖననం చేసిన విషయం తెలిసిందే. అక్కడే కనీవినీ ఎరుగని రీతిలో, మూడముచ్చటగా, చరిత్రకు సాక్ష్యంగా స్మారక మండపాన్ని నిర్మించాలని అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు 9.09 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.80 కోట్లతో నిర్మాణ పనులను ప్రజాపనులశాఖ ప్రారంభించింది. అమ్మ స్మారక మండపం, ప్రదర్శనశాల (ఎగ్జిబిషన్‌), మేధోసంపత్తిని పెంచే ఉద్యానవనం, పాదరక్షలు భద్రపరిచే స్థలం, సేవా భవనాలను నిర్మించారు. నల్లచలువరాతితో నడక మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. వాటర్‌ ఫౌంటైన్లు, పచ్చిక మైదానం వంటి వసతులతో మెరుగుపరిచారు.

జయలలిత పట్టుదలకు చిహ్నంగా..
ఈ స్మారక మండపాన్ని ఫీనిక్స్‌ పక్షి ఆకారంతో చూపరులను కట్టిపడేసేలా అద్భుతంగా నిర్మించారు. జయమ్మ బ్రతికివున్నప్పుడు తనను ఎన్నిసార్లు ఓడించినా ఫీనిక్స్‌ పక్షిలా మళ్ళీ పైకి వస్తానంటూ తరచుగా చెబుతుండేవారు. ఆమె ధీమాను, ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలను, అనుకున్నది సాధించే ఆమె స్థైర్యాన్ని, ఆమె చేసిన శపథాన్ని తలపించే విధంగా ఆమె సమాధి ప్రాంతాన్ని ఫీనిక్స్‌ పక్షి ఆకారంతోనే నిర్మించారు.

స్వదేశీ సాంకేతికతో..అమ్మ స్మారకమండపం
ఈ స్మారకమండపాన్ని భారతీయ సాంకేతిక పరిజ్ఞాన సంస్థ పర్యవేక్షణలో స్వదేశీ సాంకేతికతో నిర్మించడం విశేషం. ఈ స్మారక మండపం అన్ని రకాల శీతోష్ణపరిస్థితులలోనూ రంగు వెలిసిపోకుండా స్థిరంగా వుండే విధంగా నిర్మించారు. కాంక్రీటు పైకప్పులన్నింటికీ పాలిథీన్‌ పూతపూశారు.

8555 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎగ్జిబిషన్
ఈ స్మారకమందిరంలో 8555 చదరపు అడుగుల విస్తీర్ణంలో జయలలిత జీవితానికి సంబంధించిన ఫోటోలతో ఎగ్జిబిషన్ నిర్మించారు. ఈ భవనం పైకప్పులో కొంత భాగం వంపులు తిరిగి కాంక్రీటు, మరికొంత భాగం అద్దాలను కలిగి చూపరులకు వింత అనుభూతిని కలిగిస్తోంది.పలు రకాల మైనపు విగ్రహాలు, ఫొటో ప్రదర్శన శాలలున్నాయి. ఇక మేధోసంపత్తిని పెంచే ఉద్యానవనం కూడా చూపరులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రాంగణం రెండు వైపులా 110 అడుగుల పొడవునా పైకప్పుతో కూడిన నడక దారి కూడా ఉంది. సోలార్‌ ద్వారా ఈ స్మారక మండపానికి విద్యుత్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నారు.

ప్రత్యేక ఆకర్షణగా ఉద్యానవనాలు..వాటర్ ఫౌంటేన్లు
జయ స్మారక మండపానికి వచ్చే సందర్శకులను ఆకట్టుకునే రీతిలో పలుచోట్ల అందమైన వివిధ రకాలకు చెందిన ఉద్యానవనాలు కూడా ఏర్పాటు చేశారు. పలు చోట్ల వాటర్‌ ఫౌంటైన్లు కూడా ఉన్నాయి. ఈ ఉద్యానవనాలలో పలు చోట్ల రాజమహేంద్రవరం నుంచి తెప్పించిన అరుదైన పూల మొక్కలను కూడా నాటారు. ఇవి కాకుండా చిట్టడవులను తలపించే రీతిలో మియావాకి గార్డెన్‌ను ఫీనిక్స్‌ పక్షి ఆకారపు కట్టడం వెనుకవైపున ఏర్పాటు చేశారు.

ప్రధాన ఆకర్షణగా గురు శిష్యులు ఎంజీఆర్‌, జయలలిత కాంస్య విగ్రహాలు
ఈ స్మారక మండపం నిర్వహణ పనులను నిరంతరం పర్యవేక్షించడానికి అనువుగా ప్రజాపనుల శాఖ (సివిల్‌ అండ్‌ ఎలక్ర్టికల్స్‌) సేవా భవనాన్ని కూడా నిర్మించారు. ఇక ప్రవేశద్వారంలో వాటర్‌ ఫౌంటైన్లకు చేరువగా ఎంజీఆర్‌, జయలలిత కాంస్య విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక మంత్రులు, ప్రముఖుల వాహనాలు వచ్చివెళ్లేందుకుగాను కాంక్రీట్‌ రహదారి కూడా నిర్మించారు. అమ్మ స్మారక మండపం ఎంట్రన్స్ వద్ద ఇరువైపులా సింహం ఆకారంలో నల్లరాతి విగ్రహాలు నిర్మించారు. ఇవి కాకుండా అమ్మ స్మారక మండపం అంతటా విద్యుత్‌ దీపాలు, సీసీ కెమెరాలు, పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టమ్స్‌ కూడా ఏర్పాటు చేశారు. ఎంజీఆర్‌ సమాధి వద్ద ఉన్నట్లే జయ సమాధి వద్ద కూడా అఖండజ్యోతిని ఏర్పాటు చేశారు. అన్ని హంగులతో నిర్మించిన అమ్మ స్మారక మండపాన్ని సీఎం ఎడప్పాడి పళనిస్వామి బుధవారం (జనవరి 27) ప్రారంభించారు.