టీడీపీ మాజీ ఎంపీ కొడుకు ఆత్మహత్యాయత్నం, అసలేం జరిగింది..

టీడీపీ మాజీ ఎంపీ కొడుకు ఆత్మహత్యాయత్నం, అసలేం జరిగింది..

tdp ex mp son suicide attempt: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం రాంజీ పరిస్థితి విషమంగా ఉంది. చావుతో పోరాడుతున్నాడు. గత రాత్రి రాంజీ నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ తెల్లవారుజామున రాంజీని చూసిన కుటుంబీకులు, అతన్ని వెంటనే ఏలూరులో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా, కార్డియాక్ అరెస్టు కావడంతో విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ పై రాంజీకి చికిత్స అందిస్తున్నారు. రాంజీ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కొన్ని గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమన్నారు. కాగా, రాంజీ ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరాలేదు.

మాగంటి రాంజీ టీడీపీలో యువనేతగా ఉన్నారు. కాగా, గతంలో రాంజీపై పలు పోలీసు కేసులు నమోదయ్యాయి. వరసకు వదిన అయ్యే మహిళకు అసభ్యకరమైన మెసేజ్ లను పంపించాడన్న కేసు విషయంలో విచారణ కొనసాగుతోంది. తనకు జిల్లా తెలుగు యువత అధ్యక్ష పదవి కావాలని కూడా రాంజీ గతంలో రోడ్డెక్కిన సంగతి తెలిసిందే.

దీనిపై రెండు వెర్షన్లు వినిపిస్తున్నాయి. ఆత్మహత్యాయత్నం కాదు.. రాంజీకి గుండెపోటు రావడంతోనే ఆస్పత్రికి తరలించారని కొందరు చెబుతున్నారు. సోషల్ మీడియాలో కొంతమంది రాంజీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. మాగంటి బాబు కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేశారు. 2014లో టీడీపీ నుంచి ఏలూరు నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.