ఉక్కుకోసం.. ఆంధ్రప్రదేశ్ బంద్‌కు టీడీపీ మద్దతు

ఉక్కుకోసం.. ఆంధ్రప్రదేశ్ బంద్‌కు టీడీపీ మద్దతు

విశాఖ ఉక్కు కోసం మార్చి 5వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. ఈమేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటన చేయగా.. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటసమితి, కార్మిక సంఘాలకు కూడా తమ వంతుగా మద్దతు ప్రకటిస్తున్నామని వెల్లడించారు.

బంద్‌ కారణంగా చిత్తూరు, తిరుపతిలో తలపెట్టిన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారాయన. రాష్ట్ర ప్రయోజనాల అంశంలో టీడీపీ ఎప్పుడూ రాజీపడదని.. పార్టీ నేతలు, కార్యకర్తలు బంద్‌ను విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రగడ చినికిచినికి గాలివానగా మారుతోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ఆందోళన బాట పట్టిన కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఆందోళనను ఉదృతం చేస్తున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ రేపు ఏపీ బంద్‌కు పిలుపునివ్వగా వైసీపీ, బీజేపీ మినిహా అన్ని పార్టీలు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు మద్దతుగా వర్తక ,వాణిజ్య, విద్యా సంస్థలు, థియేటర్లు, పరిశ్రమలు, రాజకీయ పార్టీలతో సహా అన్ని వర్గాలు సహకరించాలని వామపక్ష పార్టీలు కోరాయి. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపాయి.