నేను పెళ్లి చేసుకోను మాడమ్..చదువుకుంటానంటూ ఎస్పీకి విద్యార్థిని ఫోన్

నేను పెళ్లి చేసుకోను మాడమ్..చదువుకుంటానంటూ ఎస్పీకి విద్యార్థిని ఫోన్

Telangana 10th calss girl child marriage :  ప్లీజ్‌ మాడమ్..నాకు పెండ్లి వద్దు..నేనీ పెళ్లి చేసుకోను మాడమ్ నేను చదువుకుంటానంటూ ఓ విద్యార్ధిని ఎస్పీకి ఫోన్ చేసి వేడుకుంది. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీ ఆ బాలికకు జరిగే బాల్య వివాహాన్ని ఆపిన ఘటన తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది.

న‌వాబ్‌పేట మండలంలోని కొత్తపల్లికి చెందిన ఓ బాలిక ఎస్పీ రెమారాజేశ్వరికి ఫోన్‌ చేసి..తనకు తన తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకుంటున్నారనీ…కానీ తనకు చదువుకోవాలని ఉందని ఎస్పీకి తెలిపింది. బాలిక ఫోన్ కు వెంటనే స్పందించిన ఎస్పీ రెమా రాజేశ్వరి బాలికను వివాహం నుంచి కాపాడి బాలసదన్‌కు తరలించారు.

ఈ బాల్య వివాహానికి సంబంధించి మహబూబ్‌నగర్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌ సీఐ హన్మప్న తెలిపిన వివరాల ప్రకారం..కొత్తపల్లికి చెందిన చెన్నయ్య, వెంకటమ్మకు ముగ్గురు కూతుళ్లు ఉండగా.. వీరిలో ఇద్దరు కుమార్తెల పెళ్లి జరిపించారు. మూడో కూతురు కూడా పెళ్లి చేస్తే తమ బాధ్యత తీరిపోతుందనుకున్నారు. దానికి కోసం ఏర్పాట్లు కూడా చేశారు. కొత్తపల్లి గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న ఆ బాలికకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. ఇంకా చదువుకోవాలనే కోరిక ఉంది. దీంతో తనకు పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి ఏర్పాట్లు చేయటంతో తనకు వివాహం జరిగితే ఇక చదువుకోవటం కుదరదు..ఇంటికే పరిమితం అయిపోతాననే భయంతో వెంటనే జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరికి ఫోన్ చేసి విషయం చెప్పింది.

బాలిక ఎస్పీకి ఫోన్‌ చేయడంతో ఐసీడీఎస్‌, సఖి కేంద్రం అధికారులు రంగంలోకి దిగారు. బాలికను జిల్లా కేంద్రంలోని బాలసదన్‌కు తరలించారు. బాల్యవివాహం చేసేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి బాలికను బాలసదనం నుంచి కేజీబీవీలో చేర్పించినట్లు సీఐ హన్మప్ప తెలిపారు.