Konda Surekha : మావోయిస్టుల హయాంలోనే తెలంగాణ బాగుండేది : కొండా సురేఖ

కేసీఆర్ మావోయిస్టులతో కలిసి తెలంగాణ ఉద్యమం చేశారని తెలిపారు. ఇప్పుడు మావోయిస్టులను అణచివేతకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.

Konda Surekha : మావోయిస్టుల హయాంలోనే తెలంగాణ బాగుండేది : కొండా సురేఖ

Konda Surekha

Konda Surekha : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టుల హయాంలోనే తెలంగాణ బాగుండేదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ మావోయిస్టులతో కలిసి తెలంగాణ ఉద్యమం చేశారని తెలిపారు. ఇప్పుడు మావోయిస్టులను అణచివేతకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. మావోయిస్టులు ఉండుంటే టీఆర్ఎస్ నేతల ఆగడాలు సాగేవి కావన్నారు. మావోయిస్టులు ప్రజా జీవితానికి ఇబ్బంది కలిగించలేదని చెప్పారు. కాంగ్రెస్ పేదలకు ఇచ్చిన భూములను టీఆర్ఎస్ వెనక్కి తీసుకుందని ఆరోపించారు.

‘కొండా’ సినిమా ప్రమోషన్ కోసం విజయవాడ వెళ్లిన ఆమె.. కంట్రోల్ రూం వద్ద ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఏపీలో తమ సినిమా ప్రమోషన్‌ను ప్రారంభించారు. వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించి తర్వాత సురేఖ మాట్లాడుతూ తాము ప్రస్తుతం వైఎస్సార్ రాజకీయ భిక్షతోనే ఈ స్థితిలో ఉన్నామని కొండా సురేఖ అన్నారు. వైఎస్‌ఆర్‌కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. తాను ఎప్పటికీ వైఎస్సార్ అభిమానినేనని అన్నారు.

RGV: కొండా.. ఓ డైనమిక్ పర్సనాలిటీ.. అందుకే సినిమా

వైఎస్సార్ మరణం తరువాత వారి కుటుంబాన్ని కలవలేదని చెప్పారు. వరంగల్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసినట్లు పేర్కొన్నారు. దేశం, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలోనే తమపై అక్రమ కేసలు పెట్టారని వెల్లడించారు. ‘కొండా’ సినిమా ప్రేమకథ అన్న సురేఖ.. అందులో తన భర్త మురళీ నక్సలైట్ జీవితం, రాజకీయ జీవితాన్ని చూపించారన్నారు. దేశంలో ప్రస్తుతం రాజకీయాలు దారుణంగా మారాయని తెలిపారు. డబ్బుతో రాజకీయాలు నడుస్తున్నాయని.. దీనికి బీజేపీనే కారణమని ఆరోపించారు.

1995 నుంచి రాజకీయాల్లో ఉన్న కొండా సురేఖ.. తెలంగాణలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి ఆత్మీయులుగా పేరు తెచ్చుకున్నారు. వైఎస్సార్ మరణం అనంతరం జగన్ వెంట నడిచిన సురేఖ.. 2012లో జరిగిన ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైన రోజుల్లోనూ కొండా కుటుంబం వైఎస్సార్ ఫ్యామిలీ వెంటే నడిచింది. 2014లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన సురేఖ.. ఆ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం లభించకపోవడంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికీ కొండా కుటుంబానికి గట్టి పట్టు ఉంది.