తెలంగాణలో Rapid Tests..ఇక అరగంటలోనే రిజల్ట్

  • Published By: madhu ,Published On : July 3, 2020 / 08:00 AM IST
తెలంగాణలో Rapid Tests..ఇక అరగంటలోనే రిజల్ట్

తెలంగాణలో కరోనా వైరస్ బాధితులు పెరిగిపోతూనే ఉన్నారు. టెస్టులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులకు కేవలం 15 నిమిషాల్లోనే వైరస్ ఉందా ? లేదా ? అనేది తెలుసుకొనేందుకు ఉపయోగించే…ర్యాపిడ్ యాంటీజెన్ డిటెక్షన్ టెస్టు ద్వారా పరీక్షలు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.

అరగంటలో ఫలితం : –
దీని ద్వారా…గరిష్టంగా అరగంటలో ఫలితం రానుంది. ఈ మేరకు భారతీయ వైద్య పరిశోధన మండలి (ICMR) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుక సంబంధించి..రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ నుంచి కిట్లు రాష్ట్రానికి రానున్నాయి. వైరస్‌ తీవ్రత ఉన్న ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటిని నిర్వహిస్తారు. అప్పటికప్పుడే ఫలితం ప్రకటిస్తారు.

వీరికి పరీక్షలు : –
65 ఏళ్లు పైబడినవారు, తీవ్ర శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న వారు, 100.4 డిగ్రీలకు పైబడి జ్వరం, దగ్గుతో తీవ్ర శ్వాసకోశ సంక్రమణ వ్యాధులు ఉన్నవారికి దీనిద్వారా పరీక్షించాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కంటైన్మెంట్‌ జోన్లు, ఊపిరితిత్తుల వ్యాధి, గుండె జబ్బులు, తీవ్ర వైరస్‌ లక్షణాలున్న వారు, కాలేయ వ్యాధి, మూత్రపిండాల వ్యాధి, మధుమేహం, నాడీ సంబంధిత రుగ్మతలు తదితర అనారోగ్య లక్షణాలున్న వారికి ఈ యాంటీజెన్‌ పరీక్షల వల్ల వేగంగా కరోనా వైరస్‌ నిర్ధారణ చేయడానికి వీలు కలుగుతుందంటున్నారు.

పేరుకపోతున్న శాంపిళ్లు : –
ప్రస్తుతం రాష్ట్రంలో RT-PCR ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి ఎక్కువ సమయం పడుతోంది. పరీక్షలు చేయడం..ఈ శాంపిల్స్ ను లేబరేటరీలకు తరలించడం వల్ల చాలా సమయం పడుతోంది. అంతేగాకుండా…శాంపిళ్లు ఎక్కువ సంఖ్యలో పేరుకపోతున్నాయి. దీంతో పరీక్షల నిర్వహణపై విమర్శలు వస్తున్నాయి.

ఆరోగ్య కేంద్రంలోనే పరీక్షలు : –
ఈ క్రమంలో యాంటీజెన్‌ పరీక్షలపై సర్కారు దృష్టి సారించింది. పైగా యాంటీజెన్‌ పరీక్షకు నమూనా సేకరించిన తర్వాత తప్పనిసరిగా గంటలోనే పరీక్ష చేయాల్సి ఉంటుందని, లేకుంటే నమూనా వృథా అయిపోతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. లేబొరేటరీలకు నమూనాలను రవాణా చేసే పరిస్థితి లేకపోవడం వల్ల శాంపిళ్లు సేకరించిన ఆరోగ్య కేంద్రంలోనే అప్పటికప్పడు పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు.

Read:ప్రైవేటు దవాఖానల్లో గదులు ఫుల్.. కరోనా రాకముందే ప్రీ-బుకింగ్‌!