తెలంగాణలో రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికులకు కొత్త నిబంధనలు

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మే 15వ

  • Published By: naveen ,Published On : May 11, 2020 / 10:31 AM IST
తెలంగాణలో రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికులకు కొత్త నిబంధనలు

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మే 15వ

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మే 15వ తేదీ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీపై సీఎం సమీక్షించనున్నారని, బస్సులు నడపడంపై ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఆర్టీసీ బస్సులు నడిపే విషయంపై రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. రాష్ట్రంలో ఎప్పటి నుంచి బస్సులు నడపాలన్న దానిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ నెల 15 తర్వాత రాష్ట్రంలో పరిస్థితులను బట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఇకపై బస్సులు ఎలా నడపాలి.. సీట్ల కేటాయింపు ఏ విధంగా ఉండాలి… ప్రయాణికులను ఏవిధంగా బస్సులో ఎక్కించాలి? అనే దానిపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.

ఒకే సీట్లో ముగ్గురు లేదా నలుగురు కూర్చోవటం… నిలుచుని ప్రయాణించటం కుదరదు:
కాగా, గతంలో మాదిరిగా ఇకపై ఆర్టీసీ ప్రయాణం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ఒకే సీట్లో ముగ్గురు లేదా నలుగురు కూర్చోవటం… నిలుచుని ప్రయాణించటం కుదరదన్నారు. కాగా, ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ.. లాక్ డౌన్ తో మరింత సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. లాక్ డౌన్ సమయంలో కూడా సిబ్బందికి 50శాతం వేతనాలు ఇచ్చామని మంత్రి గుర్తు చేశారు. త్వరలోనే ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించబోతున్నారని.. ఆ సమావేశంలో అన్ని నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి అజయ్ తెలిపారు.

మే 15న ఆర్టీసీ సర్వీసులపై ప్రభుత్వం కీలక ప్రకటన:
కరోనా నేపథ్యంలో మార్చి 22వ తేదీ నుండి ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఒక్క బస్సు కూడా రోడ్డెక్క లేదు. మే 15న అధికారులతో సీఎం సమావేశం కానున్నారని, ఆ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను సీఎం కేసీఆర్ అధ్యయనం చేయనున్నారని తెలుస్తోంది. ఆయా రాష్ట్రాలు, జిల్లాల పరిస్థితులను అధ్యయనం చేసిన మీదట ఆర్టీసీ బస్సుల రాకపోకలపై నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉందట. కాగా, ఆర్టీసీలో పనిచేసే సిబ్బంది బస్సులను సిద్దం చేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఆదేశాలిచ్చినా ఆర్టీసీ బస్సులు రోడ్డుపైకి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దెబ్బతిన్న బస్సులను రిపేర్ చేస్తున్నారు. రెండు రోజులకు ఒక్కసారైనా బస్సులను స్టార్ట్ చేసి ముందుకు వెనక్కు నడుపుతున్నారు. బస్సులోని ఇంజన్ భాగాల పనితీరు ఎలా ఉందనే విషయాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు.

కాగా గతంలో మాదిరి కాకుండా బస్సుల్లో ప్రయాణికులకు కొత్త నిబంధనలు విధించనున్నారు. 
* ప్రతి బస్సులో సగం సీట్లలోనే ప్రయాణీకులను తమ గమ్య స్థానాలకు చేర్చనున్నారు. 
* భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులను తప్పనిసరి చేయనున్నారు. 
* మాస్కులు లేకపోతే బస్సుల్లోకి ప్రయాణీకులను అనుమతించరు.
* డిపో నుండి బస్సు బయలుదేరే ముందు బస్సును రసాయనాలతో శుభ్రం చేస్తారు.
* 50 శాతం ఆక్యుపెన్సీ తో బస్సులను నడపాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. 
* రాష్ట్రంలో దూర ప్రాంతాలకు మాత్రమే బస్సులను నడపాలని ఆర్టీసీ యోచన. 
* 40 మందితో ప్రయాణం చేసే బస్సులో కేవలం 20 మంది తోనే నడిపేలా ప్రణాళికలు. 
* టికెట్లు బస్సులో కాకుండా ఆన్ లైన్ లేదా రిజర్వేషన్ కౌంటర్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
* 50శాతం ఆక్యుపెన్సీ తో బస్సులు నడిస్తే చార్జీలు కూడా డబుల్ అయ్యే అవకాశం.

మొత్తంగా బస్సులు తిరిగే విషయంపై ఈ నెల 15వ తేదీన ప్రభుత్వం ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఏపీలోనూ మే 17 తర్వాత ఆర్టీసీ బస్సులను నడిపించే యోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

లాక్ డౌన్ 3 లో భారీ సడలింపులు ఇచ్చిన కేంద్రం:
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3వ దశ లాక్ డౌన్ అమల్లో ఉంది. కాగా, ఈ లాక్ డౌన్ లో కేంద్రం భారీ సడలింపులు ఇచ్చింది. దీంతో దాదాపు అన్ని వ్యవస్థలు ప్రారంభం అయ్యాయి. పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. రేపటి(మే 12,2020) నుంచి రైళ్లు కూడా నడవనున్నాయి. పలు రాష్ట్రాల మే 17 తర్వాత ఆర్టీసీ బస్సులు నడిపే యోచనలో ఉన్నాయి. ఇప్పటికే సొంత వాహనాలు ఉన్నవారు తిరగొచ్చని కేంద్రం పర్మిషన్ ఇవ్వడంతో అంతా రోడ్లు ఎక్కుతున్నారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎంతో కఠినంగా లాక్ డౌన్ అమలు చేసినా కరోనాకు అడ్డుకట్ట పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడం వల్ల కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, భారీగా కేసులు పెరుగుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది.

Read More :

జూన్‌ తొలివారంలో రైళ్ల కూత.. ఆర్టీసీ బస్సులు నడిచేనా?