తెలంగాణలో ఉచిత బియ్యం పంపిణీ

  • Published By: madhu ,Published On : July 5, 2020 / 08:58 AM IST
తెలంగాణలో ఉచిత బియ్యం పంపిణీ

తెలంగాణలో లబ్దిదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు. గత మూడు నెలల్లో ఇచ్చి 12 కిలలకు బదులు… ఈనెల నుంచి 10 కిలోలే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం ఇస్తున్న ఐదు కిలోలకు అదనంగా ప్రతి లబ్దదారుడికి తెలంగాణ ప్రభుత్వం 5 కిలోలు కలిపి ఇవ్వనుంది.

ఆహార భద్రత కార్డుదారుల్లో పేర్లు నమోదైన ఒక్కొక్కరికి నెలకు 10 కిలోల బియ్యాన్ని ఐదునెలల పాటు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. గత మూడు నెలలుగా జాతీయ ఆహారభద్రత కార్డులు కలిగిన పేదలకు కేంద్ర ప్రభుత్వం 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తోంది. దీన్ని మరో 5 నెలలపాటు అంటే జూలై నుంచి నవంబరు దాకా పొడిగిస్తూ ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారు.

దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొంది. కేంద్రం ఇచ్చినట్లే జూలై నుంచి నవంబరు వరకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కేంద్రం ఇచ్చే 5 కిలోలు, రాష్ట్రం ఇచ్చే 5 కిలోలు కలిపి ఒక్కో లబ్ధిదారునికి నెలకు 10 కిలోల చొప్పున ఉచితంగా అందజేయనున్నారు. నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది.

తెలంగాణలోని 87 లక్షల 55వేల ల ఆహార భద్రత కార్డుల్లోని 2 కోట్ల 79 లక్షల మందికి నెలకు 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందనుంది. సాధారణ రోజుల్లో ఆహార భద్రత కార్డున్న లబ్ధిదారుడికి కిలోకు రూపాయి ధరతో నెలకు 6 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేస్తారు. అయితే, కొవిడ్‌-19 ప్యాకేజీ కింద ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో ప్రతి లబ్ధిదారునికి 12 కిలోల చొప్పున తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేసింది.

రాష్ట్రంలోని 87 లక్షల 55వేల ఆహార భద్రత కార్డులు ఉండగా, ఇందులో 53లక్షల 30వేల కార్డులు కేంద్రం జారీచేసిన జాతీయ ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఈ కార్డులున్న వారికి ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున కేంద్ర ప్రభుత్వం.. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో ఉచితంగా బియ్యం పంపిణీ చేసింది. వీరికి అదనంగా 7 కిలోల చొప్పున ఉచితంగా ఇవ్వాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించింది. ఆ మేరకు లబ్ధిదారులకు 12 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ అయింది. మిగిలిన 34 లక్షల 25వేల రాష్ట్ర ఆహార భద్రత కార్డులున్న లబ్ధిదారులకు 12 కిలోల చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే ఉచిత బియ్యం పంపిణీ చేసింది.

కేంద్రం సర్దుబాటుచేసిన కోటాతో కలిపి ఏప్రిల్‌లో 3.18 లక్షల టన్నులు, మే నెలలో 3.26 లక్షల టన్నులు, జూన్‌లో 3.25 లక్షల టన్నుల బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రతి నెల ఒకటో తేదీలోపే బియ్యం రేషన్‌ షాపులకే చేరితే, ఒకటో తేదీ నుంచి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తుంటారు.

అయితే ఈ నెల మాత్రం ఆలస్యం జరుగుతోంది. చౌకడిపోలకు పూర్తిస్థాయిలో బియ్యం చేరటానికి మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం నుంచి జాతీయ ఆహార భద్రత చట్టం కింద ప్రతి నెల 95,800 టన్నుల బియ్యం రాష్ట్రానికి వస్తోంది. 53.3 లక్షల కార్డులపై 5 నెలలకు 4.79 లక్షల టన్నుల బియ్యం కేంద్రం నుంచి రానుంది. మిగిలిన బియ్యం రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేస్తుంది. మొత్తం 2.79 కోట్ల లబ్ధిదారులకు 2.79 లక్షల టన్నుల బియ్యం ప్రతినెలా పంపిణీ కానుంది.