హైదరాబాద్ లో సూర్యుడి ప్రతాపం : 44 – 46 ఉష్ణోగ్రతలు

  • Published By: madhu ,Published On : May 24, 2020 / 01:16 AM IST
హైదరాబాద్ లో సూర్యుడి ప్రతాపం : 44 – 46 ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌లోనూ భానుడి భగభగలకు జనం బెంబేలెత్తుతున్నారు. 2020, మే 23వ తేదీ శనివారం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తించాయి. ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదైనప్పటికీ.. తీవ్రమైన ఉక్కపోత, భయంకరమైన వేడి, కరెంట్ కోతలతో జనం అల్లాడారు.

ఉదయం 07 గంటలకే సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ దాటాయి. భద్రాచలంలో 46.8 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యుడు ప్రతాపానికి పగలు సైతం కర్ఫ్యూ వాతావరణం తలపిస్తోంది. ఎండలకు వడగాలులు తోడవ్వడంతో ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావడం లేదు. ఉదయం 9 నుంచే వేడెక్కుతున్న వాతావరణం రాత్రి 8గంటల వరకు చల్లబడడం లేదు.

శనివారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో 45 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 2020, మే 23వ తేదీ నెల్లూరు జిల్లా కసుమూరులో 44 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కురిచేడులో 43 డిగ్రీలు, కర్నూలు జిల్లా యనకండ్లలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటే.. ఎండల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖ, విజయవాడ నగరాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. తీవ్రమైన ఉక్కపోతతో జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఈరోజు కూడా ఏపీ, తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది.