ఆదివాసీల గుస్సాడీ నృత్యానికి గౌరవరం..60 ఏళ్ల కనక రాజును వరించిన ‘పద్మశ్రీ’

ఆదివాసీల గుస్సాడీ నృత్యానికి గౌరవరం..60 ఏళ్ల కనక రాజును వరించిన ‘పద్మశ్రీ’

Telangana Ghussadi Dancer Kanaka Raju Padma Shri  : కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పద్మ పురస్కారాల జాబితాలో తెలంగాణ నుంచి ఒక్కరికి మాత్రమే పద్మశ్రీ వరించింది. ఆదివాసీల సంప్రదాయ నృత్యం గుస్సాడీ నృత్యాన్ని ‘పద్మశ్రీ’వరించింది. తెలంగాణలోని కుమురంభీం జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన 60 ఏళ్ల కనక రాజుకు గుస్సాడీ నృత్యానికి చేసిన అరుదైన సేవల్ని కేంద్రం గుర్తించింది.

ఆదివాసీల సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో ప్రావీణ్యం పొందిన కనక రాజును పద్మశ్రీ వరించింది. కనకరాజును గుస్సాడీ రాజుగా పిలుస్తారు. 1981లో అప్పటి ఇందిరాగాంధీ ముందు, ఆ తరువాత దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సమక్షంలోనూ, ఢిల్లీ ఎర్రకోటలో గణతంత్ర వేడుకల్లో రాజు గజ్జె‌కట్టి గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించారు.

గత 40 ఏళ్లుగా గుస్సాడీ నృత్య ప్రదర్శనలు ఇస్తున్న రాజు ఎంతోమంది యువతకు ఈనాటికీ గుస్సాడీ నృత్యాన్ని నేర్పిస్తున్నారు. తమ ఆచార సంప్రదాయాల్ని నేటి యువత ద్వారా రాబోయే తరాలకు కూడా చేరాలని కనకరాజు ఆకాంక్షిస్తుంటారు. కనకరాజు అలియాస్ గుస్సాడీ రాజుకు పద్మశ్రీ రావటంతో ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కేటీఆర్ అభినందించారు.

దేశ ప్రము‌ఖుల సమ‌క్షంలో గజ్జె‌కట్టి గుస్సాడీ ఆడిన ఘనుడు కనకరాజు. తమ సంప్రదాయ నృత్యమైన గస్సాడీతో పాటు ధింసా నృత్యాల్ని కూడా కనకరాజు యువతకు నేర్పిస్తుంటారు. గుస్సా‌డీకి ఆయన చేసిన సేవ‌లను గుర్తించిన కేంద్రం ప్రతి‌ష్ఠా‌త్మక పద్మశ్రీ పుర‌స్కారం ప్రక‌టించటంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.