Tribals new Village : పుట్టి పెరిగిన ఊరు వద్దనుకుని కొత్త గ్రామాన్ని నిర్మించుకుంటున్న గిరిజనులు

Tribals new Village : పుట్టి పెరిగిన ఊరు వద్దనుకుని కొత్త గ్రామాన్ని నిర్మించుకుంటున్న గిరిజనులు

Adilabad Tribals New Village Construction

Adilabad Tribals new Village construction :   గిరిజనులంటేనే సంప్రదాయాలకు విలువనిచ్చేవారు. ఎంత నాగరికతను అందిపుచ్చునే గిరిజనులైనా సరే వారి సంస్కృతి సంప్రదాయాలను విడిచిపెట్టరు. అలాగే వారు పుట్టి పెరిగిన ప్రాంతాలను వదిలి పెట్టరు. వేరే ప్రాంతంలో అన్ని వసతులు కల్పిస్తామని చెప్పినా గిరిజనులు వారు పుట్టి పెరిగిన ప్రాంతాలను వదిలి వెళ్లటానికి ఏమాత్రం ఇష్టపడరు. గిరిజనులకు నమ్మకాలకు ఎంతగా ప్రాధాన్యతనిస్తారో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అటువంటి నమ్మకమే మూఢత్వంగా మారి పుట్టి పెరిగిన ఊరిని కాదని ఆ ఊరికి దూరంగా గుడిసెలు వేసుకుని అక్కడే ఉంటామంటున్నారు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొంతమంది గిరిజన కుటుంబాల వారు.

దీనికి కారణం వారి గ్రామంలో ఏదో అరిష్టం జరిగిందనీ అందుకే గ్రామంలో ఎటువంటి శుభకార్యాలు జరగటంలేదనీ అందుకే ఊరు వదలి వచ్చేశామని ఇక ఎప్పటికీ ఇక్కడే ఉంటామని ఓ కొత్త గ్రామాన్ని నిర్మించుకుంటామని అంటున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని పాటగూడ(కే) గ్రామంలో కోలం గిరిజన తెగకు చెందిన 85 కుటుంబాలవారు..!

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం పాటగూడ(కే) గ్రామంలో నివసించే గిరిజన పాటగూడ మండలంలోని పాటగూడ గ్రామానికి చెందిన గిరిజనులు కొత్త గ్రామాన్ని నిర్మించుకుంటామని అంటున్నారు. ఈ గ్రామంలో కోలం గిరిజన తెగకు చెందిన 85 కుటుంబాలు ఉన్నాయి. పాటగూడలో తమకు ఎలాంటి శుభకార్యాలు జరగడం లేదని..ఏదో రకంగా కీడు జరుగుతోందని..అందరూ అస్తమానూ..అనారోగ్యం బారిన పడుతున్నామని కుమ్ర వంశానికి చెందిన 10 కుటుంబాలు, కోడప, ఆత్రం వంశానికి చెందిన మరో రెండు కుటుంబాలు.. ఆ గ్రామాన్ని వదిలి కొద్ది దూరంలో మరో గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ప్రస్తుతానికి వాళ్లంతా గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. త్వరలో ఇళ్లు కట్టుకుంటామని చెబుతున్నారు.

2021 మార్చి 12, 13న పాటగూడ గ్రామస్తులు ఒక పెళ్లికని వేరే గ్రామానికి వెళ్లి వస్తుండగా..ఆ 12 కుటుంబాలు పక్కనే ఉన్న కుమ్ర జంగు వ్యవసాయ చేనులో గుడిసెలు నిర్మించుకున్నట్లు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ఉట్నూర్‌ సీఐ నరేష్‌కుమార్, స్థానిక ఎస్‌ఐ నందిగామ నాగ్‌నాథ్‌ మంగళవారం (మార్చి 16,2021) పాటగూడ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో నివసించేవారితోనూ..గ్రామం వదిలి మరో ప్రాంతానికి వెళ్లిపోయిన ఇరువర్గాలతో మాట్లాడారు. గ్రామం వదిలి వెళ్లినవారికి నచ్చచెప్పటానికి యత్నించారు. కానీ ఆ గ్రామంలో ఉంటే మాకు అంతా చెడే జరుగుతోంది..కాబట్టి ఇక్కడే ఉంటామని కచ్చితంగా చెప్పారు.

మీవన్నీ మూఢ నమ్మకాలు..అటువంటివాటికి దూరంగా ఉండాలని.. అందరూ కలిసిమెలిసి ఉండాలని, ఎలాంటి గొడవలూ చేయొద్దని అధికారులు ఎన్నో విధాలుగా చెప్పిచూశారు. కానీ గ్రామాన్ని వదిలివెళ్లిన కుటుంబాలవారు వినిపించుకోలేదు. తమ కుటుంబసభ్యులు ఆ గ్రామంలో ఉంటే తరుచూ అనారోగ్యం బారిన పడుతున్నారని..అందుకే కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. పాటగూడ గ్రామస్తులతో తమకు ఎలాంటి గొడవలూ లేవని..వారితో మేం ఎటువంటి వాదాలకు పోమని..గొడలు పెట్టుకోమని స్పష్టం చేయటంతో పోలీసు అధికారులు ఇక ఏమీ చేయలేక వెనుదిరిగి వెళ్లిపోయారు.