Corona Second Wave: తెలుగు సినిమాలు వెనక్కి .. హిందీ సినిమాలు వాయిదా!

ఏడాది పాటు మానవజాతిని ముప్పతిప్పలు పెట్టిన మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్ళీ విరుచుకుపడుతుంది. దీని ప్రభావం చాలా రంగాలను తాకుతుంది. వాటిలో సినీ రంగం కూడా ఒకటి. ఇప్పటికే ఈ పరిశ్రమలో కరోనా బారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. సినిమా విడుదలపై కూడా మహమ్మారి ప్రభావం గట్టిగానే పడుతుంది.

Corona Second Wave: తెలుగు సినిమాలు వెనక్కి .. హిందీ సినిమాలు వాయిదా!

Corona Second Wave

ఏడాది పాటు మానవజాతిని ముప్పతిప్పలు పెట్టిన మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్ళీ విరుచుకుపడుతుంది. దీంతో ప్రపంచంలో చాలా దేశాలు మళ్ళీ లాక్ డౌన్ దిశగా పయనిస్తున్నాయి. మన దేశంలో కూడా చాలా మహా నగరాలలో మళ్ళీ కోవిడ్ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాలు పాక్షిక ఆంక్షల మధ్య లాక్ డౌన్ కొనసాగిస్తుండగా దీని ప్రభావం చాలా రంగాలను తాకుతుంది. వాటిలో సినీ రంగం కూడా ఒకటి. ఇప్పటికే ఈ పరిశ్రమలో కరోనా బారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. సినిమా విడుదలపై కూడా మహమ్మారి ప్రభావం గట్టిగానే పడుతుంది.

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఇప్పుడు సినిమా విడుదల చేయాలంటే రానున్న మూడు నెలల పరిస్థితి ఎలా ఉంటుందనే ఆలోచన చేయాల్సి ఉంది. జూన్ వరకు కరోనా సెకండ్ వేవ్ కొనసాగే అవకాశం ఉందని నిపుణుల హెచ్చరికలతో సినిమా వాయిదా వేసుకోవడమే బెటర్ అనే ఆలోచనకు వస్తున్నారు సినీ మేకర్స్. తెలుగు సినిమాల పరిస్థితి ఎలా ఉన్న బాలీవుడ్ లో మాత్రం ఇది స్పష్టంగా కనిపిస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో సిద్దమైన మన సినిమాలు హిందీ వెర్షన్ వెనక్కు వస్తుండగా.. హిందీ సినిమాలు విడుదల వాయిదాకు సిద్దమవుతున్నాయి.

హిందీ సినిమా మార్కెట్ లో ముంబై, కోల్ కతా, ఢిల్లీ, పూణే, నోయిడా లాంటి నగరాలు కీలకం. ఇప్పుడు ఆ నగరాలలోనే కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా సాగుతుంది. దీంతో ప్రజలు థియేటర్స్ వెళ్లేందుకు సిద్ధంగా లేకపోగా కొన్ని నగరాలలో ఇప్పటికే ఆంక్షలు మొదలయ్యాయి. మహారాష్ట్రలో మరోసారి లాక్ డౌన్ విధించే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. దీంతో వాయిదా వేసుకోవడమే ఉత్తమమని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అక్షయ్ కుమార్- రోహిత్ శెట్టి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్ `సూర్యవంశీ` విడుదలకు సిద్ధంగా ఉంది. ఈనెల 30న ఈ సినిమా విడుదలకు సిద్ధమైన నిర్మాతలు ప్రమోషన్ కూడా గ్రాండ్ గానే ప్లాన్ చేశారు.

కానీ హీరో అక్షయ్ కరోనా బారిన పడడంతో మరికొంతమంది యూనిట్ కూడా హోమ్ క్వారంటైన్ కు వెళ్లారు. మరోవైపు ప్రభుత్వం లాక్ డౌన్ ఆలోచన చేస్తుండడంతో ఈ సినిమా వాయిదా వేసుకోవడం గ్యారంటీగా కనిపిస్తుంది. ఇదే బాటలో మిగతా సినిమాలు వాయిదా వేసుకోవడం అవసరంగా కనిపిస్తుంది. చిన్న సినిమాలు ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ మీద విడుదలకు అవకాశం ఉండగా భారీ బడ్జెట్ ఇబ్బందులతో క్రేజీ ప్రాజెక్ట్స్ థియేటర్స్ లోనే రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అలానే విడుదలకు అంతా సిద్ధమైనా వాయిదా వేసుకోవడం కూడా నిర్మాతలకు అదనపు భారమే. మరి ఈ నష్టాల నుండి మూవీ మేకర్స్ ఎలా బయటపడతారో చూడాల్సి ఉంది.