Jilebi : తెనాలి జిలేబీ..ఆ టేస్టే వేరు గురూ…

తెనాలి జిలేబీ తయారీ విధానం విషయానికి వస్తే చాయ మినపప్పు, బియ్యం పిండి, మైదా సమపాళ్ళల్లో కలిపి 8గంటలపాటు కొంత నీరు కలిపి నానబెడతారు.

10TV Telugu News

Jilebi : ఆంధ్ర పారిస్ అంటే గుర్తుకు వచ్చేది తెనాలి. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఉన్న తెనాలి ప్రాంతం కళాకారులకు పుట్టినిల్లు. సినీనటులు కృష్ణ, గుమ్మడిలతోపాటు అనే మంది సినీ ప్రముఖులు ఈ ప్రాంతానికి చెందిన వారే. ఎంతో చరిత్ర కలిగిన తెనాలి జిలేబి వ్యాపారానికి కూడా పెట్టింది పేరు. ఇక్కడ తయారయ్యే రుచికరమైన జిలేబీని ఇష్టపడని వారంటూ ఉండరు. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ జిలేబి తయారుచేస్తూ దానిపైనే జీవిస్తున్న కుటుంబాలు చాలా ఉన్నాయి.

తెనాలి జిలేబికి చాలా పెద్ద చరిత్ర ఉంది. 1965 నుండి ఇక్కడ జిలేబి వ్యాపారం నడుస్తోంది. తొలుత చీమకుర్తి సుబ్బయ్య అనే వ్యక్తి జిలేబి తయారీకి అధ్యునిగా చెప్పవచ్చు. రంగువేయని బెల్లంతో జిలేబి తయారీ ప్రారంభించాడు. ఆయన తరువాత బొట్లగుంట రామయ్య రంగులు కలిపిన బెల్లంతో జిలేబీ తయారీ చేట్టాడు. రామయ్య వ్యాపారంలోకి అడుగుపెట్టిన తరువాత తెనాలిలో జిలేబికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం పట్టణంలో ఒక బజారంతా జిలేబి కొట్ల దుకాణాలంటే ఆశ్ఛర్యం కలుగకమానదు.

తెనాలి బోస్ రోడ్డు నుండి వహాబ్ చౌక్ కు వెళుతుంటే యాకూబ్ హుస్సేన్ రోడ్డును జిలేబి కొట్ల బజారుగా అంతా పిలుస్తుంటారు. ఎందుకంటే ఆ బజారు మొత్తం జిలేబి తయారీ దుకాణాలే.. ఒకవైపు వేడి వేడిగా జిలేబి తయారవుతుంటే మరోవైపు కొనుగోలు చేసేవారు. అక్కడే జిలేబి తినే వారు అంతా సందడిసందడిగా ఉంటుంది.

రుచికరమైన ఈ జిలేబిని తినేందుకు చుట్టుపక్కల ప్రాంత వాసులే కాదు. విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల నుండి సరదాగా వాహనాలపై వచ్చి జిలేబి ఆరగించి, ఇంట్లో వాళ్ళకు, స్నేహితులకు కొనుగోలు చేసి తీసుకువెళుతుంటారు. మద్రాసు కేంద్రంగా తెలుగు సినీ పరిశ్రమ ఉన్న సమయంలో తెనాలి నుండి ప్రతినిత్యం మధ్యాహ్నసమయంలో రైలో అక్కడి సినీ ప్రముఖులకు తెనాలి జిలేబి వెళ్ళేదంటే నమ్మితీరాల్సిందే..తెనాలి జిలేబిని తమిళనటులు సైతం లొట్టలేసుకుని తినేవారట.

చెన్నైలాంటి ప్రాంతాలకే కాదు. ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు సైతం తెనాలి జిలేబిని ఇక్కడి వారు పంపిస్తుంటారు. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే జిలేబి కోసం చాలా మంది పడిచస్తుంటారు. కరోనా కారణంగా కొంతకాలంగా జిలేబి వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కోగా ప్రస్తుతం వ్యాపారం బాగానే ఉంది.

తెనాలి జిలేబీ తయారీ విధానం విషయానికి వస్తే చాయ మినపప్పు, బియ్యం పిండి, మైదా సమపాళ్ళల్లో కలిపి 8గంటలపాటు కొంత నీరు కలిపి నానబెడతారు. కొద్దిగా గోరు వెచ్చని నీరు కలిపి మెత్తగా జారిపోయేలా పిండిని తయారు చేస్తారు. ఓ వస్త్రం తీసుకుని దానికి చిన్న రంద్రం చేసి , బిండిని కొంత వస్త్రంలోకి తీసుకుంటారు. ముందుగా స్టౌ పై వెలిగించుకున్న బాగా మరిగిన నూనెలో వస్త్రంలో నింపిన పిండిని చుట్టులు చుట్టలుగా వేస్తారు. బాగా వేగిన అనంతరం మరోక స్టౌవ్ పై బాణాలిలో కరిగించి వేడిగా ఉన్న బెల్లం పాకంలో ఈ జిలేబీ చుట్టలను ముంచుతారు. ఆ చుట్టలకు బెల్లం బాగా బాగా పట్టుకున్నాక పాకం నుండి వాటిని బయటకు తీస్తారు.

ఇలా వేడివేడి జిలేబిని తెనాలి వ్యాపారులు చాకచక్యంగా తయారు చేస్తారు. నల్లబెల్లం, తెల్లబెల్లం, వివిధ రకాలలో జిలేబి తెనాలిలో లభ్యమవుతుంది. చక్కెరతో తయారు చేసిన స్వీట్లకంటే బెల్లంతో తయారైన జిలేబీలో మంచి పోషకాలు ఉండటంతో జిలేబీ తినటం మంచిదని కొనుగోలు దారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ కేజీ జిలేబి 140 రూపాయలకు లభిస్తుంది.

 

10TV Telugu News