ఈ కష్టాలేంటి? గోవిందా! అలిపిరి వద్ద భక్తుల ఆందోళన

ఈ కష్టాలేంటి? గోవిందా! అలిపిరి వద్ద భక్తుల ఆందోళన

Tension At Alipiri: దేవదేవుడు, తిరుమలవాసుడు, కలియుగ శ్రీనివాసుడు, వెంకటేశ్వరస్వామి భక్తులు తిరుమలలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం సుదూరం నుంచి వచ్చే భక్తులకు టోకెన్ల జారీ విషయంలో టీటీడీ అనుసరిస్తున్న విధానం విమర్శలకు కారణం అవుతుండగా.. సిబ్బంది కూడా తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని భక్తులు ఆరోపిస్తూ అలిపిరి వద్ద ఆందోళనకు దిగారు భక్తులు.

టిక్కెట్లు లేకుండా కొండపైకి అనుమతి ఇవ్వడం లేదంటూ భక్తులు అలిపిరి వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు దర్శన టికెట్లు లేకుండానే తిరుమలకు వందలాది మంది భక్తులు వస్తుండగా.. తమను కొండపైకి పంపాలని అలిపిరి దగ్గర భక్తులు ధర్నాకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో భక్తులు వాగ్వాదానికి దిగారు. మరోవైపు తిరుమల శ్రీ వెంకన్న సర్వదర్శనం టోకెన్లను టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది.

ఈ క్రమంలోనే టీటీడీ తీరును వ్యతిరేకిస్తూ.. అలిపిరి గరుడ విగ్రహం వద్ద భక్తులు ఆందోళన చేస్తూ.. ఈ కష్టాలేంటి? గోవిందా! అంటూ నినాదాలు చేస్తున్నారు భక్తులు.. డిసెంబర్ 24వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనం కోసం తిరుపతిలోని స్థానికులకు మాత్రమే టీటీడీ టోకెన్లను జారీ చేయ్యగా.. సోమవారం నుంచి జనవరి 2వ వరకు సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది.

ఇప్పటికే 24 వరకు సర్వదర్శనం టోకెన్లు జారీ అవగా.. నేటి నుంచి జనవరి 3వ తేదీ వరకు శ్రీవారి దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులే తిరుమలకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కరోనా నిబంధనలు నేపథ్యంలో దర్శన టిక్కెట్లు లేని భక్తులు తిరుమలకు రావద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.