అయ్యో పాపం.. ట్రంక్ పెట్టెలో దాచిన డబ్బుకు చెదలు, చిత్తు కాగితాల్లా మారిన 5లక్షలు

అయ్యో పాపం.. ట్రంక్ పెట్టెలో దాచిన డబ్బుకు చెదలు, చిత్తు కాగితాల్లా మారిన 5లక్షలు

termites eat 5 lakh rupees in trunk box: కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కష్టపడి సంపాదించిన డబ్బు చెదలపాలైంది. వ్యాపారంలో వచ్చిన లాభాలను ఓ వ్యక్తి ట్రంక్ పెట్టెలో దాచగా, దానికి చెదలు పట్టాయి. కరెన్సీ నోట్లన్నీ చిరిగిపోయాయి. చిత్తు కాగితాల్లా మారాయి. రాత్రి, పగలు శ్రమించి సంపాదించిన లక్షల రూపాయల డబ్బు ఇప్పుడు ఎందుకూ పనికి రాకుండా పోవడంతో ఆ వ్యక్తి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. అందరి హృదయాలను ద్రవింపజేసింది.

బాధితుడి పేరు బిజిలి జమలయ్య. మైలవరం వాటర్ ట్యాంక్ దగ్గర నివాసం ఉంటాడు. జమలయ్య పందుల వ్యాపారం చేస్తాడు. కాగా, అతడికి బ్యాంక్ అకౌంట్ లేదు. దీంతో వ్యాపారంలో వచ్చిన లాభాలను తన దగ్గరున్న ట్రంకు పెట్టెలో దాచాడు. ఇక భయం లేదని భావించాడు. పది లక్షలు పోగు చేసి ఇల్లు కట్టుకుందామని కలలు కన్నాడు. ఆ ఆలోచనతో సుమారు 5లక్షల రూపాయలు ట్రంక్ పెట్టెలో దాచాడు.

కాగా, వ్యాపారానికి లక్ష రూపాయలు అవసరం పడింది. దీంతో రాత్రి తన ట్రంకు పెట్టె తెరిచాడు. అంతే, ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. పెట్టెలో డబ్బు చూసి బావురుమన్నాడు. నీరసంతో సొమ్మసిల్లి పడిపోయాడు. ట్రంకు పెట్టెలోని నోట్ల కట్టలకు చెదలు పట్టడమే ఇందుకు కారణం. చెదలు పట్టిన డబ్బుని బయటకు తీసిన జమలయ్య.. మంచంపై వేశాడు. అందులో బాగున్న కొన్ని నోట్లను వేరు చేశాడు.

కాగా, చెదలు పట్టిన నోట్లతో ఇంట్లో చిన్న పిల్లలు వీధిలోకి వెళ్లి ఆడుకోసాగారు. పిల్లల చేతిలో కరెన్సీ నోట్లు చూసిన స్థానికులు నోరెళ్ళబెట్టారు. దాని గురించి ఆరా తీశారు. ట్రంక్ పెట్టెలో దాచిన 5లక్షలకు చెదలు పట్టాయని తెలిసి విస్తుపోయారు. జమలయ్య ఇంటికి వెళ్లి చూశారు.

ఈ విషయం ఆనోటా ఆనోటా పాకింది. చివరకు పోలీసుల వరకు చేరింది. రంగంలోకి దిగిన పోలీసులు జమలయ్య ఇంటికి వచ్చి ఆరా తీశారు. పోలీసులను చూడడంతో జమలయ్య బోరున విలపించాడు. తాను నష్టపోయాయని వాపోయాడు. తనకు న్యాయం చేయాలని జమలయ్య, అతడి కుటుంబసభ్యులు వేడుకున్నారు. జమలయ్య పరిస్థితి చూసి స్థానికులు అయ్యో పాపం అని జాలి చూపించారు. ఈ రోజుల్లోనూ బ్యాంకు అకౌంట్ లేని వారు ఉన్నారా అని తెలిసి విస్మయం చెందారు.