ఇక మాస్కులు తప్పనిసరి కాదు, రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం

ఇక మాస్కులు తప్పనిసరి కాదు, రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం

Texas Governor Lifts Mask Mandate: టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా తప్పనిసరి చేసిన ‘మాస్క్ ధరింపు’ నిబంధనను రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు టెక్సాస్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక 100 శాతం వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. లుబ్బాక్ చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతుండటం, అలాగే వ్యాక్సిన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుండటం వల్ల మాస్క్ తప్పనిసరి అనే నిబంధనలను ఎత్తివేస్తున్నామన్నారు.

కరోనా ఆంక్షల వల్ల అనేక మంది ఉపాధిని కోల్పోయారని, చిన్న వ్యాపారులు కూడా తమ కరెంట్ బిల్లులు, ఇంటి అద్దెలు కట్టుకోలేని పరిస్థితిని ఎదుర్కొన్నారని గ్రెగ్ అబాట్ వాపోయారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆంక్షలు కొనసాగకూడదని, వెంటనే వ్యాపారాలకు 100 శాతం అనుమతులను ఇస్తున్నామన్నారు. ఈ సమయంలో ఇది ఎంతో అవసరమని ఆయన చెప్పారు.

“ఇదే కరోనాకు అంతం. ఇక టెక్సాస్ 100 శాతం తెరచుకున్నట్టే. ఎవరూ మాస్కులను ధరించడం తప్పనిసరి కాదు. ఏ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించాలనుకున్నా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు” అని గ్రెగ్ అబాట్ అన్నారు.

రాష్ట్ర ప్రజల దగ్గర మహమ్మారిని తరిమికొట్టే ఆయుధాలు ఉన్నాయని గవర్నర్ అన్నారు. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో టాప్-2గా ఉన్న టెక్సాస్ లో 8 నెలల క్రితం మాస్క్ ను తప్పనిసరి చేశారు.