Telangana Formation Day: నీళ్లు, నిధులు, నియామకాలే నినాదంగా.. తెలంగాణకు ఏడేళ్లు!

Telangana Formation Day: నీళ్లు, నిధులు, నియామకాలే నినాదంగా.. తెలంగాణకు ఏడేళ్లు!

The State Of Telangana Was Officially Formed On 2 June 2014

Slogan of  WWW(Water, Wealth, Work): జూన్ 2.. తెలంగాణ చరిత్రలో ఎన్నటికీ మర్చిపోలేని రోజు. 60ఏళ్ల పోరాటాలు.. ఎన్నో ఉద్యమాలు.. ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాల ఫలంగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఆవిర్భవించిన రోజు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఏడేళ్లు పూర్తి చేసుకున్న రోజు.. అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రయాణం మొదలైన రోజు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో జనం కొట్లాడి సాధించుకున్న 29వ రాష్ట్రం తెలంగాణ.. దేశంలో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించి నేటికి ఏడేళ్లు పూర్తయ్యింది.

తెలంగాణ రాష్ట్రానికి ఏడేళ్లు నిండాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని టీఆర్ఎస్ పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ 2001 ఏప్రిల్ 27న పార్టీ ఏర్పాటు చేసి ఉద్యమం చేపట్టారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, ఎందరో యువకుల బలిదానం.. సుదీర్ఘ పోరాటం తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష సాకారమైంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటికి ఎన్నో సవాళ్లను ఎదురొడ్డుతూ తనదైన శైలిలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించారు.

ఏడేళ్ల క్రితం పుట్టిన తెలంగాణ.. నేడు దేశవ్యాప్తంగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సీఎం కేసీఆర్‌ పాలనలో అభివృద్ధి దిశగా తెలంగాణ పరుగులు పెడుతోంది. తెలంగాణ వస్తే చీకట్లు తప్పవని నాటి పాలకుల చేసిన హెచ్చరికలు తప్పని నిరూపిస్తూ.. విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న రాష్ట్రంగా దూసుకెళ్తోంది తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రం పలు రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందడుగు వేస్తుంది. ఇప్పటికే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు, తాగునీరు అందిస్తోంది. 24 గంటల పాటు విద్యుత్‌తో పాటు రైతుబంధు పథకం, ఆసరా పింఛన్లతో ప్రజలకు చేరువైంది. నాసిరకం విత్తనాలు, కల్తీ ఎరువులపై ఉక్కుపాదం మోపి రైతులకు అండగా నిలిచింది తెలంగాణ ప్రభుత్వం.

రాష్ట్రంలో గుడుంబా, డ్రగ్స్ లాంటి నిషేధిత పదార్థాల వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. డబుల్ బెడ్ రూమ్‌ల ఇళ్ల నిర్మాణం జరుగుతున్నా… ప్రభుత్వం చెప్పిన రెండు లక్షల ఇళ్లు లబ్దిదారులకు అందకపోవడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఉన్నాయి. 2018లో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఆసరా పింఛన్లులను పెంచి ఇచ్చారు సీఎం కేసీఆర్. ఉద్యోగాల నియామకం విషయంలో ప్రభుత్వం కొన్ని విమర్శలు ఎదుర్కొంటోంది. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టింది. ఓ వైపు నిర్బంధ పంటల సాగు, కొనుగోలు విషయంలో ప్రభుత్వం కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది.

గతంలో తెలంగాణ ప్రాంతం కరువు కాటకాలతో సతమతమయ్యేది. ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఈ తప్పిదాన్ని సరిదిద్దేందుకు కేసీఆర్ సర్కారు మిషన్ కాకతీయ పేరిట చెరువుల పునరుద్ధరణకు నడుం బిగించింది. వేలాది చెరువులకు పునరుజ్జీవం పోసింది. దీంతో చెరువులు నీటితో కళకళలడాతున్నాయి. నల్గొండలో ఉన్న ఫ్లోరైడ్ బాధితులను చూస్తే మనసు విలవిల్లాడుతుంది. దీనికి ప్రాధాన కారణం తాగునీరు. దీంతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఏర్పాటు చేసి మంచి నీరు అందిస్తున్నారు. గోదావరి తలాపునే పారుతున్నా.. ఇన్నాళ్లూ బోరు నీళ్లు మాత్రమే తాగిన పల్లెవాసులు ఇప్పుడు గోదావరి నీళ్లను రుచి చూస్తున్నారు.

ఇక తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మీ పథకం, రైతు బంధు లాంటి పథకాలైతే ఓ సంచలనం. మిగతా రాష్ట్రాలు సైతం వీటిని అమలు చేస్తున్నాయి. పేదింటి ఆడ పిల్లల పెళ్లికి డబ్బులు ఇవ్వడం కోసం రూపొందించిన కళ్యాణ లక్ష్మీ పథకం అందరి ప్రశంసలు పొందింది. రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 5 వేలు చొప్పున ప్రతి ఏటా రెండు విడతల్లో పది వేల రూపాయలను రైతులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వస్తోంది.

మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్ళు గడిచిపోయాయి. ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో సవాళ్లను అధిగమిస్తూ… కేసీఆర్ సర్కార్ ముందుకెళ్తోంది. కరోనాతో ఈ ఏడాది కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించనున్నారు. రాజధాని హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాల్లోనూ గరిష్టంగా పది మందికి మించకుండా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.