ఆందోళనలు చేస్తున్న రైతులకు ఎయిర్ కూలర్లు, తాగునీళ్లు.. మానవత్వం చాటుకున్న విదేశీ ఎన్జీవో

ఆందోళనలు చేస్తున్న రైతులకు ఎయిర్ కూలర్లు, తాగునీళ్లు.. మానవత్వం చాటుకున్న విదేశీ ఎన్జీవో

Khalsa Aid Helping Farmers: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలు శుక్రవారం(మార్చి 5,2021) నాటికి 99వ రోజుకు చేరాయి. కేంద్రం దిగొచ్చే వరకు వెనకడుగు వేసేది లేదని, ఉద్యమాన్ని సుదీర్ఘకాలం కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు తేల్చి చెప్పారు. మండుటెండులను సైతం లెక్క చేయకుండా అన్నదాతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

రైతులు ఆందోళనలు చేస్తున్న ప్రాంతంలో మానవత్వం వెల్లివిరిసింది. వారిది ఈ దేశం కాకపోయినా, మన రైతుల కోసం భారత్ కు వచ్చారు. అన్నదాతలకు అండగా నిలిచారు. ఎండ వేడి తట్టుకునేందుకు రైతులకు చల్లని గాలిచ్చే కూలర్లు ఏర్పాటు చేశారు. దాహం తీర్చేందుకు తాగునీటి సరఫరా పెంచారు. అలాగే దోమల బెడద లేకుండా ఏర్పాట్లు చేశారు. దోమలు దరిచేరకుండా క్రీములు, మందులు, తెరలు అందిస్తున్నారు. ఇలా, రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో ఏర్పాట్లన్నీ చేశారు. అన్నదాతలకు అండగా నిలిచిన ఆ వాలంటీర్లు.. యూకేకి చెందిన చారిటీ సంస్థ కల్సా ఎయిడ్(Khalsa Aid) కి చెందిన వారు.

బుధవారం(మార్చి 3,2021) రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో దోమల బారి నుంచే కాపాడే క్రీములు, దోమ తెరలు పంపిణీ చేశారు. ఇక ఒక్కసారిగా ఎండలు పెరిగాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దాహంతో గొంతు ఎండిపోతోంది. దీంతో వారి దాహార్తిని తీర్చేందుకు తాగునీటి బాటిళ్ల సరఫరాని పెంచారు. ఇప్పుడు వాలంటీర్లు మరో అడుగు ముందుకేశారు. ఎండవేడి నుంచి రైతులకు ఉపశమనం కలిగించేందుకు చల్లని గాలి వచ్చేందుకు ఎయిర్ కూలర్లు తెప్పించారు.

కల్సా ఎయిడ్ వాలంటీర్ల సేవలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని పొగుడుతున్నారు. కాగా, అన్నదాతల కోసం వారు రంగంలోకి దిగడం ఇది తొలిసారి కాదు. డిసెంబర్ లోనూ ఆందోళనలు చేస్తున్న రైతులకు ఆహారం అందించారు. అంతేకాదు, ఈ ఎన్జీవో.. 600 బెడ్లతో నైట్ షెల్టర్ ఏర్పాటు చేసింది. అలాగే లోదుస్తులు, టూత్ బ్రష్, సానిటరీ ప్యాడ్స్ ఇలా అన్నీ అందించింది. శానిటరీ ప్యాడ్స్ ను ఉచితంగా మహిళలకు పంపిణీ చేస్తుననారు. అంతేకాదు, కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్న వృద్ధ రైతుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. వయసు పైబడ్డ వృద్ధులకు ఉపశమనం కలిగించేందుకు మసాజ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు.

khalsa aid kisan mall

ఈ ఎన్జీవో ప్రపంచవ్యాప్తంగా తన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. చలి తీవ్రతతో వణికిపోయిన టెక్సాస్ లో.. ప్రజలకు ఆపన్నహస్తం అందించారు. ఆకలితో అలమటిస్తున్న 500 మందికి భోజనాలు పెట్టారు. 300 బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. ఉత్తరాఖండ్ జలప్రళయం సమయంలోనూ ఈ ఎన్జీవో టీమ్ రంగంలోకి దిగి తమ వంతు సాయం చేసింది.