ఇంకా పట్టాలెక్కని ప్యాసింజర్‌ రైళ్లు.. కేంద్రం తీరుపై ప్రయాణికుల ఆగ్రహం

10TV Telugu News

till now no passenger trains: తక్కువ ఖర్చుతో దూర గమ్యస్థానాలకు చేరుకోవాలంటే పేద, మధ్య తరగతి వారికి ప్రధానమైన రవాణ మార్గం రైల్వే. లాంగ్ జర్నీ అనగానే ముందుగా గుర్తొచ్చేది ట్రైనే. ఇన్నాళ్లూ ప్రయాణికులతో కిటకిటలాడిన రైల్వే స్టేషన్లు ఇప్పుడు బోసిపోయాయి. కరోనా ఆంక్షల కారణంగా రైల్వే స్టేషన్లు వెలవెలపోతున్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. కేంద్రం కరోనా ఆంక్షలు దాదాపు ఎత్తేసింది. అన్ని రంగాలకు మినహాయింపులు ఇచ్చింది. కానీ, రైళ్లకు మాత్రం కొవిడ్ ఆంక్షలు కొనసాగిస్తోంది. దీంతో ప్యాసింజర్ రైళ్లు ఇంకా పట్టాలెక్కని పరిస్థితి. దీంతో ప్రయాణికులు కేంద్రం తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. ఇంకా ఎన్నాళ్లీ బాధ మాకు అని నిట్టూరుస్తున్నారు.

ఎన్నికల సభలు జరుగుతున్నాయి.. వేల మంది హాజరవుతున్నారు.. థియేటర్లలో పక్కపక్కనే కూర్చుని సినిమా చూస్తున్నారు.. బస్సుల్లో తిరిగే విషయంలోనూ ఎలాంటి నిబంధనలు లేవు.. మార్కెట్లలో ఎంతమంది జనం ఉంటున్నారో అసలు లెక్కే లేదు.. ఎక్కడా ఆంక్షల్లేవు.. ఎవరిలోనూ కోవిడ్‌ భయం లేదు.. జనజీవనం దాదాపుగా సాధారణ పరిస్థితుల్లోకి వచ్చేసింది.. కానీ, రైళ్ల విషయంలో మాత్రం ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. స్పెషల్‌ పేరుతో ఎక్స్‌ప్రెస్, ప్రీమియం కేటగిరీ రైళ్లనే తిప్పుతూ ప్యాసింజర్‌ రైళ్లను మాత్రం పక్కన పెట్టేసింది. సభల నుంచి సినిమాల వరకు అన్నింటా ఆంక్షలు ఎత్తివేస్తూ కోవిడ్‌ జాగ్రత్తలు పాటించమని చెబుతున్న కేంద్రం.. ఎంతోమందిని గమ్యస్థానం చేర్చే రైళ్ల విషయంలో అందుకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరిస్తోంది? అన్నదే సగటు ప్రయాణికుడి ప్రశ్న.

లాక్‌డౌన్‌ సమయం మినహాయిస్తే ఇప్పుడు ప్రయాణాల విషయంలో దాదాపు ‘సాధారణ పరిస్థితి’ వచ్చేసింది. ప్రజలు రాకపోకలతో బిజీగా మారిపోయారు. కానీ రైల్వేస్టేషన్లు మాత్రం బోసిపోయే ఉంటున్నాయి. కోవిడ్‌ నిబంధనలు క్రమంగా సడలిస్తూ సాధారణ పరిస్థితి కలిగేలా చూస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రైళ్లను నడిపే విషయంలో భిన్నంగా వ్యవహరిస్తుండటం ప్రయాణికులకు శాపంగా మారింది. దీంతో బస్సులు, ఇతర వాహనాల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు.

ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ కూడా పూర్తిస్థాయిలో సర్వీసులు నడిపిస్తోంది. తొలుత సిటీ బస్సులను పరిమితంగా నడిపిన ఆ సంస్థ.. ఇప్పుడు వాటిని కూడా దాదాపు పూర్తిస్థాయిలో నడుపుతోంది. కానీ రైల్వే మాత్రం ఒక్క ప్యాసింజర్‌ రైలును కూడా నడపటం లేదు. హైదరాబాద్‌ నుంచి ఇతర పట్టణాలకు తిరిగే డెమూ మెమూ రైళ్లతోపాటు ఎంఎంటీఎస్‌ రైళ్లను కూడా ఆపరేట్‌ చేయడం లేదు. కేవలం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, ప్రీమియం కేటగిరీ రైళ్లలో కొన్నింటిని కోవిడ్‌ స్పెషల్‌ రైళ్లు, పండగల ప్రత్యేక రైళ్ల పేరుతో నడుపుతోంది. ఇవి జనం అవసరాలకు ఏమాత్రం సరిపోవడంలేదు.

ఒక్క ప్యాసింజర్‌ రైలు కూడా లేదు..
రాష్ట్రం నుంచి 250 వరకు ప్యాసింజర్‌ రైళ్లు నడుస్తాయి. వీటిలో 180కి పైగా దక్షిణమధ్య రైల్వేకు సంబంధించినవి కాగా, మిగతావి ఇతర జోన్లలో మొదలై దక్షిణమధ్య రైల్వే మీదుగా నడిచేవి. అల్పాదాయ వర్గాలకు చెందినవారంతా ఎక్కువగా వీటిపైనే ఆధారపడతారు. అయితే, ఈ రైళ్లలో ఒక్కటి కూడా ఇప్పుడు నడవడం లేదు. ఇక సాధారణ రోజుల్లో సగటున నిత్యం 303 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, రాజధాని, శతాబ్ది వంటి ప్రీమియం కేటగిరీ రైళ్లు నడిచేవి. వీటిలో ప్రస్తుతం నిత్యం సగటున 179 మాత్రమే నడుస్తున్నాయి. ఇవన్నీ పండగ ప్రత్యేక రైళ్లు, కోవిడ్‌ స్పెషల్‌ రైళ్ల పేరుతో తిరుగుతున్నాయి.

రద్దీ మార్గాల్లోనే తక్కువ..
హైదరాబాద్‌ నుంచి ఏపీలోని విశాఖపట్టణం, విజయవాడ, నర్సాపూర్, కాకినాడ, గుంటూరు వైపు వెళ్లే రైళ్లు కిటకిటలాడుతుంటాయి. వీటిలో విజయవాడకు నిత్యం సగటున 30 వరకు రైళ్లు తిరిగేవి. కానీ ప్రస్తుతం పది మాత్రమే నడుస్తున్నాయి. అలాగే విశాఖపట్టణానికి దాదాపు 25 రైళ్లు (అన్నీకలిపి) ఉంటాయి. వాటిలో ఇప్పుడు 13 మాత్రమే తిరుగుతున్నాయి. చెన్నైకి ఐదు రైళ్లుండగా.. ఇప్పుడు రెండే వెళుతున్నాయి. బెంగుళూరుకు ఐదుకు గాను ఒక్కటే తిరుగుతోంది. ఇలా రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో కూడా చాలా తక్కువ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. తిరుపతికి నుంచి ఐదు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉండగా ప్రస్తుతం అన్నింటినీ తిప్పుతున్నారు. తిరుపతికి భక్తుల తాకిడి పెరగడంతోనే వాటిని పునరుద్ధరించారు. ముంబైకి నగరం నుంచి ఐదు రైళ్లు నిత్యం ఉండగా నాలుగు నడుస్తున్నాయి. ఢిల్లీకి మూడు రైళ్లు ఉండగా.. మూడింటినీ తిప్పుతున్నారు.

రద్దీ ఉండటం లేదంటున్న రైల్వే..
ఇప్పుడు నడుపుతున్న రైళ్లలో రద్దీ అంతగా ఉండటం లేదని, కొన్నింటికి తప్ప వెయిటింగ్‌ లిస్ట్‌ ఉండటం లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. దీంతో పూర్తిస్థాయిలో రైళ్లను పునరుద్ధరించాల్సిన అవసరం లేదన్న భావన వారి మాటల్లో వ్యక్తమవుతోంది. ‘అన్ని రైళ్లను పునరుద్ధరిస్తే తిరిగి అన్ని స్టేషన్లు కిటకిటలాడటం ఖాయం. రైళ్లు లేకపోవడంతోనే ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు అన్ని రైళ్లను నడిపితే అవి కిటకిటలాడి మళ్లీ కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే వాటిని తిప్పటం లేదు’ అని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.

అయితే, సినిమా హాళ్లు కిటకిటలాడితే కేసులు పెరుగుతాయనే భయం లేనప్పుడు.. రైళ్ల విషయంలోనే ఈ ఆంక్షలెందుకు అనేది సగటు ప్రయాణికుడి ప్రశ్న. రైళ్లు పూర్తిస్థాయిలో తిరగకపోవటంతో ట్రాక్‌కు సంబంధించిన పనులను రైల్వే ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రాక్‌కు సంబంధించి పనులు కొలిక్కి తేచ్చేందుకు కొంతకాలం ప్రయాణికుల రైళ్లను తక్కువగా నడపాలని భావించి ఉండొచ్చన్న విమర్శలు ఉన్నాయి. ప్రయాణికుల రైళ్లతో రైల్వేకు నష్టమే వస్తోందని.. అందువల్లే లాభాలొచ్చే సరుకు రవాణా రైళ్లను గతంలోకంటే ఎక్కువగా తిప్పుతున్నారని కూడా అంటున్నారు. అయితే, అధికారులు వీటిని కొట్టిపడేస్తున్నారు.

రైల్వే బోర్డు అనుమతిస్తే రైళ్లు నడిపేందుకు సిద్ధం: గజానన్‌ మాల్యా
‘కోవిడ్‌ నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో రైళ్లను నడపటం లేదు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్‌ రైళ్లను నడుపుతున్నాం. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో 60 శాతం తిప్పుతున్నాం. మిగతా రైళ్లను నడపటమనేది జోన్‌ పరిధిలో లేదు. రైల్వే బోర్డు అనుమతిస్తే నడిపేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎంఎంటీఎస్‌ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది’అని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా తెలిపారు.

×