Lunar Eclipse: రేపే చంద్ర గ్రహణం.. ఏయే నగరాల్లో చూడొచ్చు.. హైదరాబాద్‌లో ఉంటుందా?
సంపూర్ణ చంద్ర గ్రహణం మంగళవారం ఏర్పడనున్న సంగతి తెలిసిందే. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడితే, ఇంకొన్ని ప్రాంతాల్లో పాక్షిక చంద్ర గ్రహణం కనిపిస్తుంది.

Lunar Eclipse: కార్తీక పౌర్ణమి రోజైన మంగళవారం సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడబోతుంది. ఇండియాతోపాటు అఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా, నార్త్ అట్లాంటిక్ సముద్రం వంటి చోట్ల చంద్ర గ్రహణం కనిపిస్తుంది.
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సంపూర్ణ చంద్ర గ్రహణం కనిపిస్తే, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షిక చంద్ర గ్రహణం కనిపిస్తుంది. మన దేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే సంపూర్ణ చంద్ర గ్రహణం కనిపిస్తుంది. ఈటానగర్, గువహటి, సిలిగురి, కోల్‌కతా, భువనేశ్వర్ నగరాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని చూడొచ్చు. ఢిల్లీ, శ్రీ నగర్, చెన్నై, గాంధీ నగర్, ముంబై నగరాల్లో పాక్షిక చంద్ర గ్రహణం కనిపిస్తుంది. మన దేశంలో చంద్ర గ్రహణం సాయంత్రం 4.23 గంటలకు ప్రారంభమవుతుంది. పాక్షిక చంద్ర గ్రహణం 3.40 నిమిషాలపాటు ఉంటుంది. 4.23 నిమిషాల తర్వాత నుంచి వేర్వేరు నగరాల్లో, వేర్వేరు సమయాల్లో చంద్ర గ్రహణం ప్రారంభమవుతుంది.
హైదరాబాద్‌లో పాక్షిక చంద్ర గ్రహణం సాయంత్రం 5.40 నిమిషాలకు మొదలవుతుంది. మంగళవారం చంద్ర గ్రహణం ముగిసిందంటే మళ్లీ కనిపించేది 2025లోనే. దేశంలో 2025 సెప్టెంబర్ 7న తిరిగి సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. అయితే, పాక్షిక చంద్ర గ్రహణం మాత్రం 2023, అక్టోబర్‌లో కనిపిస్తుంది.