ఇదేందయ్యో..! హెల్మెట్ పెట్టుకోలేదని ట్రాక్టర్ డ్రైవర్‌కు జరిమానా..!

ఇదేందయ్యో..! హెల్మెట్ పెట్టుకోలేదని ట్రాక్టర్ డ్రైవర్‌కు జరిమానా..!

Traffic police fine tractor driver for not wearing helmet : టూవీలర్ మీద వెళ్లేవాళ్లతో పాటు వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని రూల్. అది ప్రజల భద్రత కోసం అమలు చేసే నిబంధన అనే విషయం తెలిసిందే. కానీ పోలీసుల అత్యుత్సాహం ఎలా ఉంటుందంటే..హెల్మెట్ పెట్టుకోలేదని కారు డ్రైవ్ చేసేవారికి ఫైన్ వేసిన ఘటనలు కూడా జరిగాయి. కానీ తెలంగాణ పోలీసులు అత్యుత్సాహం దీన్ని మించిపోయింది. ఏకంగా ట్రాక్టర్ డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని జరిమానా వేసేశారు. హెల్మెట్ పెట్టుకోకుండా ట్రాక్టర్ నడిపావు కాబట్టి వెంటనే రూ. 1,035 జరిమానా కట్టాలని చలానా పంపిన నిర్వాకం కామారెడ్డి జిల్లాలో జరిగింది.

అదేదో పొరపాటున అలా చేశారు అనుకుంటే అది మన పొరపాటే. పాపం సదరు ట్రాక్టర్ డ్రైవర్ కు అలా చలానా పంపించటం అది మొదటిసారి కాదట..తొమ్మిదోసారని అని బాధితుడు వాపోతున్నాడు. దీంతో పదేపదే పంపుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాడు. బీర్కూరు మండలం చించొల్లి గ్రామానికి చెందిన అమ్ముల సతీష్‌ హెల్మెట్ లేకుండా ట్రాక్టర్ నడిపాడంటూ ట్రాఫిక్ పోలీసులు రూ.1,035 చలానా పంపారు.

గత ఫిబ్రవరి 25న మద్దికుంటమర్రి క్రాస్‌రోడ్డులో హెల్మెట్ లేకుండా ట్రాక్టర్ నడిపినట్టు చలానాలో పేర్కొన్నారు. AP25 AR 4194 గల బండి 25-02-2021 నాడు మద్ది కుంట మర్రి ఎక్స్ రోడ్ లో హెల్మెట్ లేకుండ బండి నడిపాడని 135/- రూపాయలతో పాటు 1035 రూపాయలు మీసేవ లో కట్టాలని మెసేజ్ వచ్చింది. అది చూసిన సతీష్ విస్తుపోయాడు. ‘ఇదేందీ..గెప్పుడూ లేదని..హెల్మెట్ లేనందుకు చలానా విధించడం’’అంటూ షాక్ అయ్యాడు. అలా మొదటిసారి చలానా వచ్చినప్పుడు జరిగింది. ఏదో పొరపాటున అలా పంపించారేమోనని అనుకున్నాడు.

కానీ అది మరోసారి మరోసారి జరిగేసరికి ఖంగుతిన్నాడు. ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు ఇలా చలానా పంపారని సతీష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు పదేపదే చలానాలు పంపిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సతీష్ వేడుకున్నాడు. అలా గతంలో మూడుసార్లు చలానాలు కట్టానని వాపోతున్నాడు. మరి సదరు పోలీసుల తీరుపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారో లేదే చూడాలి మరి..