భారత్ లోనే : అక్కడ పురుషుల కంటే మహిళల సంఖ్యే ఎక్కువ

భారత్ లోనే : అక్కడ పురుషుల కంటే మహిళల సంఖ్యే ఎక్కువ

Tripura sex ratio women outnumber men : భారతదేశంలో ఆడపిల్లల పుట్టుక ప్రశ్నార్థకంగా మారుతున్న క్రమంలో త్రిపురలోని లింగ నిష్పత్తి ఆశాజనకంగా ఉంది. గర్భంలో ఉండగానే ఆడబిడ్డను తెలియగానే చంపేస్తున్న ఘటన గురించి వింటూనే ఉన్నాం. అలాగే ఆడపిల్ల పుట్టిందని చంపేస్తున్న దారుణ ఘాతుకాల గురించి కూడా విన్నాం. ఇటువంటి విషాదకర ఘటనల మధ్య భారత్ లోని త్రిపుర రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం చాలా శుభపరిణామం అని చెప్పాలి. పురుషలు, మహిళల నిష్పత్తే కాకుండా బాలురు-బాలికల నిష్పత్తిలో కూడా త్రిపుర బాలుర కంటే బాలిక సంఖ్యే ఎక్కువగా ఉందని జాతీయ సర్వేలో వెల్లడి కావటం చాలా ఆహ్వానించదగిన విషయం.

భారతదే‌శంలో పురు‌షు‌లతో పోలిస్తే స్త్రీల సంఖ్య తగ్గు‌తోంది. కానీ త్రిపు‌రలో మాత్రం దీనికి భిన్నంగా ఉన్నది. త్రిపుర రాష్ట్రంలో స్త్రీల సంఖ్య క్రమంగా పెరు‌గు‌తోంది. త్రిపు‌రలో పురు‌షులు, స్త్రీల లింగ‌ని‌ష్పత్తి 1000:1011గా ఉన్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివే‌దిక పేర్కొంది. ఇది 2015–16లో 1000:998గా ఉంది.

త్రిపురలోని పట్టణా‌లతో పోల్చితే గ్రామాల్లో పురు‌షుల కంటే మహి‌ళల సంఖ్య పెరు‌గు‌తోందని రాష్ట్ర మంత్రి రతన్‌ నాథ్‌ తెలిపారు. గ్రామాల్లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 1033 మంది మహిళలు ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 956 మంది స్త్రీలు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని చెప్పడానికి ఇదే నిదర్శణమని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

శిశు జననాల్లో కూడా బాలిక సంఖ్యే ఎక్కువగా ఉన్నదని సర్వే పేర్కొంది. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది బాలురకు 1028 మంది బాలికలు ఉన్నారని వెల్లడిచింది. ఐదేండ్ల క్రితం (2015-16) ఈ లింగ నిష్పత్తి 1000:956గా ఉన్నది. సంస్థాగత జననాలు కూడా 89.02 శాతంగా నమోదయ్యాయి. ఇది గతంలో 79.09 శాతంగా ఉంది. 12 నుంచి 13 నెలల వయస్సులోపు పిల్లలకు టీకాలు వేసే విషయంలో కూడా మెరుగుదల కనిపించిందని తెలిపింది. 2015-16లో ఇది 54.05 ఉండగా, ప్రస్తుతం అది 69.05 శాతానికి పెరిగిందని వెల్లడించింది.