AP CM Jagan: సీఎంగా రెండేళ్లు.. తొమ్మిదేళ్ల పోరాటం ఫలించిన రోజు

జగన్ తొమ్మిదేళ్ల పోరాటం ఫలించిన రోజు ఇది. తన కుటుంబం, పార్టీ నాయకులు, అభిమానులు, అనుచరులతో పాటు తాను కూడా కలగన్న తరుణమది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసి.. ఇవాళ్టికి రెండేళ్లు. ఈ రెండేళ్లలో జగన్.. ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.

AP CM Jagan: సీఎంగా రెండేళ్లు.. తొమ్మిదేళ్ల పోరాటం ఫలించిన రోజు

Ap Cm Jagan

Two Years for YS Jagan’s oath: జగన్ తొమ్మిదేళ్ల పోరాటం ఫలించిన రోజు ఇది. తన కుటుంబం, పార్టీ నాయకులు, అభిమానులు, అనుచరులతో పాటు తాను కూడా కలగన్న తరుణమది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసి.. ఇవాళ్టికి రెండేళ్లు. ఈ రెండేళ్లలో జగన్.. ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. బెస్ట్ సీఎం అనిపించుకుంటానని చెప్పి.. రెండేళ్ల క్రితం ఇదే రోజున పాలన ప్రారంభించిన జగన్.. పూర్తిగా ప్రజా సంక్షేమంపైనే దృష్టి పెట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా.. నవరత్నాల అమలుపైనే ఫోకస్ చేశారు.

మేనిఫెస్టోలో ఇచ్చిన 129 వాగ్దానాలకు గానూ.. దాదాపు 107 హామీలను అమలు చేసింది జగన్ సర్కార్. మిగిలిన వాటిలో.. పోలవరం, నాడు-నేడు లాంటివి.. వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకొన్ని హామీలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. కేవలం రెండేళ్లలోనే.. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో దాదాపు 95 శాతం అమలు నెరవేర్చారు సీఎం జగన్.

కరోనా సంక్షోభంలోనూ.. ఏపీలో పథకాల అమలు ఆగలేదు. వైఎస్సార్ పెన్షన్ ద్వారా దాదాపు 62 లక్షల మందికి 32 వేల 469 కోట్లు ఖర్చు చేశారు. రైతు భరోసా ద్వారా 52 లక్షల 38 వేల మంది రైతులకు.. 17 వేల కోట్లకు పైనే ఖర్చు చేశారు. అమ్మ ఒడి ద్వారా దాదాపు 45 లక్షల మహిళలకు 13 వేల కోట్లకు పైనే ఇచ్చారు. వైఎస్సార్ ఆసరా ద్వారా దాదాపు 78 లక్షల మంది మహిళలకు 6 వేల 311 కోట్లు ఖర్చు చేశారు. వైఎస్సార్ చేయూత ద్వారా 25 లక్షల మహిళలకు 4 వేల 604 కోట్లు ఖర్చు చేశారు. ఇలా.. 30కి పైగా పథకాల ద్వారా ఈ రెండేళ్లలో.. 93 వేల 708 కోట్లను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యాకానుక, ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాల ద్వారా.. మరో 31 వేల 714 కోట్లను ఖర్చు చేశారు. మొత్తంగా.. ఈ రెండేళ్లలో.. లక్షా 25 వేల 422 కోట్లకు పైగా.. ప్రజా సంక్షేమం మీదే ఖర్చు చేశారు.

రెండేళ్ల పాలనలో వ్యవసాయం, విద్యా, వైద్యశాఖలపైనా ఫోకస్ పెట్టింది జగన్ ప్రభుత్వం. రైతు భరోసాతో పాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు 3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందించడంతో పాటు వారికి అందుబాటులో ఉండేలా రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు. ఇక.. విద్యారంగంలోనూ అనేక మార్పులకు జగన్ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ పాఠశాల్లో.. కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు.. సదుపాయాలు మెరుగుపరిచేందుకు.. నాడు-నేడు కార్యక్రమం చేపట్టారు.

ప్రజారోగ్యానికి జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. వెయ్యి రూపాయల కంటే ఎక్కువ ఖర్చయ్యే.. ప్రతి చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చారు. ఆస్పత్రుల్లో వసతులు, మౌలిక సదుపాయాలను మెరుగపర్చేందుకు నాడు-నేడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. వీటితో పాటు కొత్తగా 7 వందల 108 అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చారు. వీటికి మించి.. కరోనా, బ్లాక్ ఫంగస్‌లను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా చికిత్స అందేలా చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ చేసేందుకు.. టీకాల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచారు. తన పాలనలో.. ఎక్కడా అవినీతికి అవకాశం ఇవ్వకుండా జగన్ చర్యలు తీసుకుంటున్నారు.