Bahubali Samosa Challenge : బాహుబలి సమోసా..30 నిమిషాల్లో తినేస్తే రూ.51 వేలు మీవే..

Bahubali Samosa Challenge : బాహుబలి సమోసా..30 నిమిషాల్లో తినేస్తే రూ.51 వేలు మీవే..

Up Samosa Challenge

UP Samosa challenge : మీరు ఇప్పటి వరకు ఐస్ బకెట్ చాలెంజ్‌, రైస్ బకెట్ చాలెంజ్ గురించి విని ఉంటారు. బాహుబలి థాలీ, బాహుబలి హలీమ్‌ని టేస్ట్‌ చేసి ఉంటారు. కానీ ఎప్పుడైనా సమోసా చాలెంజ్‌ గురించి విన్నారా ? ఇందులో చాలెంజ్‌ ఏముంది… చిటికెలో తినేస్తాం అంటారా..! అంతసీన్‌ లేదు.. అదేమీ మీ అరచేయి సైజులో ఉండే సమోసా కాదు. బాహుబలి సమోసా.. 30 నిమిషాల్లో దాన్ని తినగలిగితే.. 51 వేలు ఇస్తానంటూ ఆ షాప్‌ ఓనర్ చాలెంజ్‌ విసురుతున్నాడు.

ఇంట్లో చేసే రొటీన్ వంటకాలతో బోర్‌ కొడితే వీకెండ్‌లో ఎవరైనా రెస్టారెంట్లకు వెళ్లి కాస్త వెరైటీలను టేస్ట్‌ చేస్తుంటారు. ఇక తమ దగ్గరకు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆయా రెస్టారెంట్లు ఓనర్లు రకరకాల చాలెంజ్‌లు విసురుతున్నారు. అలాంటిదే ఈ సమోసా చాలెంజ్. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ స్వీట్‌ షాప్‌ ఓనర్ అలాంటి సవాలే విసిరాడు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న బాహుబలి సమోసాను కేవలం 30 నిమిషాల్లో తిన్నవారికి ఏకంగా 51 వేల రూపాయలు ఇస్తానని ప్రకటించాడు. మరి ఈ బాహుబలి సమోసా వెయిట్‌ ఎంతో తెలుసా ఏకంగా 8 కేజీలు. ఈ లెక్కన ప్రతి ఐదు నిమిషాలకూ కేజీ కంటే ఎక్కువ సమోసాని తినాల్సి ఉంటుంది. అలాగైతేనే అరగంటలో 8 కేజీలు తినగలరు. సాధారణంగా సమోసా అంటే ఓ 50 గ్రాములు లేదంటే వంద గ్రాముల బరువు ఉంటుంది. కానీ బాహుబలి సమోసా ఏకంగా 8 కేజీలు ఉండడంతో ఎవరూ సాహసం చేయలేకపోతున్నారు.

ఓ రెండు సమోసాలు తింటేనే కడుపు ఫుల్‌ అవుతుంది. అలాంటిది ఏకంగా 8 కేజీల సమోసాను తినడమంటే మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు. అయినా కొంతమంది ఫుడ్‌ బ్లాగర్‌లు ఈ చాలెంజ్‌ను ట్రై చేస్తున్నారు. మీరట్‌కు చెందిన శుభమ్‌‌కు లాల్‌కుర్తి బజార్‌లో కౌశల్ స్వీట్స్ పేరుతో స్వీట్ షాపు నిర్వహిస్తున్నాడు. అందులో ఎన్నో వెరైటీల స్వీట్స్, సమోసాలు దొరకుతాయి. కస్టమర్లను మరింతగా..ఆకట్టుకునేందుకు కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకున్న లాల్‌కుర్తి బాహుబలి సమోసాతో అందరికీ చాలెంజ్ విసురుతున్నాడు. ఈ సమోసాను తయారు చేసేందుకు గంట నుంచి గంటన్నర సమయం తీసుకుంటాడు. ఇందుకోసం రూ.1100 ఖర్చవుతుంది. బాహుబలి సమోసాలో ఆలు మసాలాతో పాటు పన్నీర్, డ్రైఫ్రూట్స్ కూడా ఉంటాయి. అందుకే దీని రుచి అద్భుతంగా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఈ చాలెంజ్‌లో గెలిచిన వాళ్లూ ఎవరూ లేరు.

ఈ సమోసా చాలెంజ్‌ ఫీవర్‌ ఇండియా మొత్తం పాకుతోంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది మిని బాహుబలి సమోసా. దీని వెయిట్ 3 కేజీలు. గజియాబాద్‌లోని ఓ హోటల్‌ ఓనర్‌ సమోసా చాలెంజ్ విసిరాడు. దీన్ని 5 నిమిషాల్లో తినేస్తే 11 వేలు ఇస్తానంటున్నాడు. ఆ సమోసాను చూసే చాలా మంది భయపడిపోయారు. కానీ ఓ యువకుడు మాత్రం ఆ చాలెంజ్‌ స్వీకరించి ఐదు నిమిషాల్లోనే ఆ మినీ బాహుబలి సమోసాను తినిశాడు. 11 వేలు బహుమతి అందుకున్నాడు. ఇవన్నీ చూసి మిగతా హోటల్స్‌ వాళ్లు కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ తరహా చాలెంజ్‌లే విసురుతున్నారు.బాహుబలి థాలీలు, బాహుబలి సమోసాలు సాధారణ మనుషులు తినలేరు. ఆ విషయం ఆయా రెస్టారెంట్‌లకు కూడా తెలుసు. అందుకే అంత పెద్ద మొత్తంలో క్యాష్‌ ప్రైజ్ పెడుతుంటారు. దాన్ని చూసి టెంప్ట్‌ అయితే… కడుపు పగిలిపోవడం ఖాయం..!